డీఎంకేను ఎదుర్కొనే స‌త్తా టీవీకేకే ఉంది

కీల‌క వ్యాఖ్య‌లు చేసిన ద‌ళ‌ప‌తి విజ‌య్

hellotelugu-TVKVijay

చెన్నై : టీవీకే పార్టీ చీఫ్‌, ప్ర‌ముఖ న‌టుడు ద‌ళ‌ప‌తి విజ‌య్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న మ‌రోసారి అధికారంలో ఉన్న డీఎంకే స‌ర్కార్ ను టార్గెట్ చేశారు. రాష్ట్రంలో డీఎంకేను ఎదుర్కొనే స‌త్తా ఒక్క త‌మ పార్టీకి మాత్ర‌మే ఉంద‌న్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు. రాబోయే శాస‌న స‌భ ఎన్నిక‌ల్లో తాము ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకునేది లేద‌ని ప్ర‌క‌టించారు. అన్ని పార్టీలు త‌మ‌తో క‌లిసి రావాల్సిందేన‌ని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఒంట‌రిగానే బ‌రిలోకి దిగుతామ‌ని చెప్పారు. త‌న‌ను కావాల‌ని ల‌క్ష్యంగా చేసుకోవ‌డం, ఇబ్బంది పెట్టాల‌ని చూసినా తాను త‌ట్టుకుని నిల‌బ‌డే శ‌క్తి ఉంద‌న్నారు త‌ళ‌ప‌తి విజ‌య్. టీవీకే పార్టీని స్థాపించి రెండు ఏళ్లు పూర్త‌యిన సంద‌ర్బంగా జ‌రిగిన కీల‌క స‌మావేశంలో పాల్గొని ప్ర‌సంగించారు విజ‌య్.

రాష్ట్రంలో డీఎంకే, దాని మిత్ర‌ప‌క్షాల‌ను ఎదుర్కొనే స‌త్తా త‌మ‌కు మాత్ర‌మే ఉంద‌న్నారు. డీఎంకేపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్ర రాజకీయాల్లో ఏకైక ‘విజిల్ బ్లోయర్’గా తన పార్టీ నిలుస్తుందని ధీమా వ్య‌క్తం చేశారు. రాబోయే ఎన్నికలలో త్రిముఖ లేదా చతుర్ముఖ పోటీ ఉంటుందని మీడియా అంచనా వేస్తున్నప్పటికీ, ‘దుష్ట శక్తులను’ ఓడించగల అగ్రగామి పార్టీగా తన పార్టీ ఒక మహావృక్షంలా నిలుస్తుందని అన్నారు. ఏఐఏడీఎంకే వ్యవస్థాపకుడు ఎం.జి. రామచంద్రన్ (ఎంజీఆర్)తో తనను పోల్చుకున్నారు. అంతే కాకుండా నటుడిగా ఉన్నందుకు విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ, 1977లో డీఎంకేను ఓడించడంలో ఎంజీఆర్ పోషించిన పాత్రను ప్రస్తావించారు.

Exit mobile version