‘భూభారతి’తో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం

'ల్యాండ్ ఆధార్'తో కూడిన పట్టాదారు పాస్‌బుక్‌ల పంపిణీ

hellotelugu-BhuBharathi

హైద‌రాబాద్ : రాష్ట్రంలోని రైతులు, భూ యజమానులు ఎదుర్కొంటున్న దశాబ్దాల నాటి భూ సమస్యలను ప్రభుత్వం ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వారికి భరోసా కల్పిస్తోంది. ‘భూభారతి’ రీ-సర్వే ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తోంది. ఈ సర్వే ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని చూపుతోంది. మహబూబాబాద్ జిల్లా కేశసముద్రం మండలం నారాయణపురంలో, ‘భూభారతి’ రీ-సర్వే ద్వారా దాదాపు 60 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న అసైన్డ్ భూముల సమస్యను పరిష్కరించి, 1,378 ఎకరాలకు సంబంధించి 780 మంది రైతులకు ‘ల్యాండ్ ఆధార్’తో కూడిన పట్టాదారు పాస్‌బుక్‌లను పంపిణీ చేశారు.

తెలంగాణలో చివరిసారిగా 125 ఏళ్ల క్రితం భూ సర్వే జరిగింది. ఆ తర్వాత ఎప్పుడూ సమగ్ర సర్వే జరగలేదు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దశాబ్దం పాటు పాలించిన గత ప్రభుత్వం కనీసం సమగ్ర భూ సర్వే గురించి ఆలోచించలేదని మంత్రి పొంగులేటి విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత‌ భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం విప్లవాత్మక సంస్కరణలు చేపట్టామన్నారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ధరణి’ స్థానంలో, భూ యజమానులకు అండగా నిలిచేలా ‘భూభారతి’ చట్టాన్ని తీసుకు వచ్చామని చెప్పారు. రాష్ట్రాన్ని వివాద రహిత తెలంగాణగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

ప్రతి అంగుళం భూమిని సర్వే చేసిన తర్వాత రైతులకు , భూ యజమానులకు క్యూఆర్ కోడ్‌లు, మ్యాప్‌లతో కూడిన పట్టాదారు పాస్‌బుక్‌లను అందిస్తున్నామని తెలిపారు. నాలుగు రోజుల క్రితం తుంగతుర్తిలోని 13 గ్రామాలకు చెందిన రైతులకు 3,400 ఎకరాలకు సంబంధించిన పట్టాలను పంపిణీ చేశామని, ఇప్పుడు నారాయణపురంలో 780 మంది రైతులకు పట్టాలు పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. ఇదంతా ‘భూభారతి’ ద్వారానే సాధ్యమవుతోందని తెలిపారు. నారాయణపురంలో తాతల కాలం నుండి సాగులో ఉన్న సుమారు 150 ఎకరాల కేటాయించని భూమి సమస్యను కూడా త్వరలోనే పరిష్కరించి, రైతులకు న్యాయం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

Exit mobile version