న్యూఢిల్లీ : కెనడా, భారత్ మధ్య వాణిజ్య ఒప్పంద చర్చలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. 2030 నాటికి భారత్‌తో వార్షిక ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 70 బిలియన్ డాలర్లకు పెంచాలని కెనడా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఒట్టావా: కెనడా, భారత్ సమగ్ర వాణిజ్య ఒప్పందం కోసం చర్చలను ముమ్మరం చేస్తున్నాయి. ఒట్టావాలో జరిగిన ఐదవ విడత చర్చల తర్వాత ఈ ఏడాది చివరి నాటికి ఒప్పందాన్ని ఖరారు చేసే దిశగా ఇరు దేశాల మంత్రులు పురోగతిని సమీక్షించారు. కెనడా అంతర్జాతీయ వాణిజ్య శాఖ మంత్రి మనిందర్ సిధు ఈ వారం న్యూఢిల్లీలో వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో సమావేశమయ్యారని ‘గ్లోబల్ అఫైర్స్ కెనడాస ఒక ప్రకటనలో తెలిపింది. పెట్టుబడి అవకాశాలు, వాణిజ్య భాగస్వామ్యాలను అన్వేషించడానికి ముంబై , బెంగళూరుకు భారీ కెనడియన్ వ్యాపార ప్రతినిధి బృందాన్ని తీసుకు వచ్చిన ‘టీమ్ కెనడా ట్రేడ్ మిషన్’ పర్యటనలో భాగంగా ఈ సమావేశం జరిగింది.
అక్టోబర్ 5 నుండి 9 వరకు ఒట్టావాలో జరిగిన ఐదవ విడత చర్చల ఆధారంగా, సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం కోసం జరుగుతున్న చర్చలపై మంత్రులు చర్చించారని కెనడా ప్రభుత్వం తెలిపింది. పరస్పర ప్రయోజనకరమైన ఒప్పందాన్ని ఖరారు చేయడానికి ఇరు దేశాలు తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నాయి అని గ్లోబల్ అఫైర్స్ కెనడా పేర్కొంది. చర్చల బృందాల మధ్య ఉన్న విభేదాలను లేదా తదుపరి విడత చర్చల తేదీని ఈ ప్రకటనలో వెల్లడించ లేదు. మే 2025 నుండి సిధు , గోయల్ మధ్య జరిగిన తొమ్మిదవ సమావేశం ఇది. ఈ నెల ప్రారంభంలో మిల్వాకీలో జరిగిన G20 వాణిజ్య మంత్రుల సమావేశంలో ఇద్దరు మంత్రుల మధ్య జరిగిన చర్చల తర్వాత ఈ కొత్త ప్రయత్నం మొదలైంది. ఇరు దేశాల వ్యాపారాలను అనుసంధానించడం , వాణిజ్య ఒప్పందాలను సులభతరం చేయడం లక్ష్యంగా పెట్టుకున్న కెనడియన్ వాణిజ్య మిషన్‌కు మద్దతు ఇచ్చినందుకు సిధు, గోయల్‌కు కృతజ్ఞతలు తెలిపారు.


















