హైదరాబాద్ : విదేశాల్లో ఉద్యోగాలకు అవసరమైన శిక్షణతో పాటు, ఆ దేశాల్లో ఉద్యోగ మేళాలు, పాస్‌పోర్ట్‌లు, ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యతను టామ్‌కామ్ తీసుకోవాలని సీఎం ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఉపాధి కోసం విదేశాలకు వెళ్లే వారికి టామ్‌కామ్ పాస్‌పోర్ట్‌లు జారీ చేయాలని, వారు వెళ్లే దేశాల్లోని మ్యాన్‌పవర్ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోవాలని సూచించారు. మంత్రి వివేక్ తో కలిసి సమీక్ష చేపట్టారు. ఉత్తర తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో కార్మికులు మధ్య ప్రాచ్య దేశాలకు వెళ్తున్నారని, ఈ క్రమంలో వారు ఏజెంట్ల చేతిలో మోసపోతూ, ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు. టామ్‌కామ్ విదేశీ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చు కోవడం ద్వారా, అక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారితో చర్చలు జరిపి, వారికి న్యాయం అందించడం సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు.
విదేశాలకు కార్మికులను రవాణా చేసే ఏజెంట్ల వివరాలను సేకరించి, వారు పంపే ప్రతి వ్యక్తి వివరాలను నమోదు చేయాలన్నారు సీఎం. ఈ విషయాలను పర్యవేక్షించడానికి టామ్‌కామ్‌కు ఒక మాజీ ఐఎఫ్‌ఎస్ అధికారిని సీఈఓగా నియమిస్తామని పేర్కొన్నారు. ఉద్యోగాలకు వెళ్లే వారికి తేలికపాటి మోటారు వాహనాలు, భారీ మోటారు వాహనాలు నడపడంలో కూడా శిక్షణ ఇవ్వాలన్నారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో నూతన ఆవిష్కరణల కోసం ఒక పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. జర్మన్, జపనీస్, కొరియన్, చైనీస్, రష్యన్ వంటి ఇతర భాషలను నేర్చుకోవడాన్ని సులభతరం చేయడానికి ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలన్నారు.
