హైదరాబాద్ : ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ పార్టీని ఏకి పారేశారు. తమ హయాంలో పార్టీ పరంగా కార్యకర్తలు, నేతలు, అభిమానులు ఇచ్చిన రక్తాన్ని ఎవరికి విక్రయించి సొమ్ము చేసుకుందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈమేరకు ఆయన బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు సవాల్ విసిరారు. బీఆర్ఎస్ హయాంలో సంక్షేమ హాస్టళ్లకు సామాగ్రి కొనుగోలుపై విచారణ కోరాలని అన్నారు . నీటి కొరత ఏర్పడితే పార్టీ అధ్యక్షుడు కె. చంద్రశేఖర్ రావు కుటుంబ సభ్యుల రక్తాన్ని వరి పొలాల్లో చల్లాలన్న తన వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ నిర్వహించిన రక్తదాన శిబిరం వివరాలను బయట పెట్టాలని కోరారు సీఎం. కార్యకర్తలకు రక్తదానం చేయాలని పిలుపునిచ్చి, శిబిరాలు ఏర్పాటు చేసినప్పటికీ… రామారావు , సీనియర్ నేత టి. హరీష్ రావుతో సహా చంద్రశేఖర్ రావు కుటుంబ సభ్యులెవరూ రక్తదానం చేయలేదని ఆయన పేర్కొన్నారు.
“వారు ఎందుకు రక్తదానం చేయలేదు? సేకరించిన రక్తాన్ని ఎవరికి ఇచ్చారు?” అని ప్రశ్నించిన రేవంత్ రెడ్డి, రక్తదాన శిబిరాల్లో సేకరించిన రక్తాన్ని బీఆర్ఎస్ ప్రైవేట్ బ్లడ్ బ్యాంకులకు విక్రయించిందని ఆరోపించారు. రామారావుకు, గ్లోబరేనా సంస్థకు మధ్య ఉన్న సంబంధాలపై తన ఆరోపణలను పునరుద్ఘాటిస్తూ, ఇంటర్మీడియట్ ఫలితాల నిర్వహణలో అవకతవకలకు పాల్పడినందుకు గత ప్రభుత్వం ఆ సంస్థను బ్లాక్‌లిస్ట్ చేసి ఉంటే, దానికి సీబీఎస్ఈ, ఎన్టీఏ కాంట్రాక్టులు దక్కేవి కాదని ముఖ్యమంత్రి అన్నారు. గత ప్రభుత్వం ఆ సంస్థపై ఉన్న కేసులను మూసి వేసిందని పేర్కొన్న రేవంత్ రెడ్డి, ఆ కేసును తిరిగి తెరిచే అవకాశాలను పరిశీలించాలని విజిలెన్స్ , ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖను ఆదేశించినట్లు తెలిపారు. భారీ స్థాయిలో అవకతవకలు జరిగాయని పేర్కొన్న ఆయన, ఆ మాజీ IPS అధికారి జైలుకు వెళ్లాల్సి వస్తుందని అన్నారు.
