అమరావతి : ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సీఎం నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఏపీ కూటమి సర్కార్ నెరవేర్చేందుకు కృషి చేస్తోందని చెప్పారు మంత్రి శ్రీ డోలా బాల వీరాంజనేయులు. త్వరలోనే కొత్త పెన్షన్లు మంజూరు చేయనున్నామన్నారు. వాటితో పాటు అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు కూడా అందజేయనున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో వచ్చే ఏ ఎన్నికల్లోనైనా కూటమి విజయం తథ్యమని మంత్రి ధీమా వ్యక్తంచేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల విద్య కోసం కూటమి ప్రభుత్వం రెండేళ్లలో రూ.వేల కోట్లు వెచ్చించిందని మంత్రి డోలా బాల వీరాంజనేయులు తెలిపారు. రూ.500 కోట్లతో బీసీ గురుకులాల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. రెండేళ్లలో ఎస్సీ హాస్టళ్లు, గురుకులాల మరమ్మతులు, నిర్మాణాలకు రూ.500 కోట్లకు పైగా వెచ్చించామన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలో మూడు ఎక్స్ లెన్స్ సెంటర్లు ఏర్పాటు చేయబోతున్నామన్నారు.
ఐటీఐ, పాలిటెక్నిక్ పూర్తి చేసిన ఎస్సీ విద్యార్థులకు మరింత నైపుణ్యం పెంచేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. టంగుటూరు ఎంజేపీ స్కూల్ కు శాశ్వత భవన నిర్మాణానికి రూ.45 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. హలో… నమస్కారమండీ బాగున్నారమ్మా..? మేం మంత్రులం మాట్లాడుతున్నామంటూ పే ఫోన్ ద్వారా విద్యార్థినుల తల్లిదండ్రులను మంత్రులు సవిత, డోలా బాలవీరాంజనేయ స్వామి పలుకరించారు. టంగుటూరు ఎంజేపీ స్కూల్లో బోధన బాగుందా… మీ పిల్లలు బాగా చదువుతున్నారా… నాణ్యమైన భోజనం పెడుతున్నారా… ? అని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్లు అందాయా… ఫ్రీ బస్ సౌకర్యం ఉపయోగించుకున్నారా..? అని విద్యార్థినుల తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు.
మంత్రులు సవిత, డోలా బాలవీరాంజనేయుల స్వామి టంగుటూరు ఎంజేపీ బాలికల గురుకుల పాఠశాలను సందర్శించారు. తరగతి గదులు, విశ్రాంతి గదులు, మరుగుదొడ్లను, వంట గదిలోని నిత్యావసర సరుకుల పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడుతూ, వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలు వినియోగించుకుని గతంలో కంటే అత్యుత్తమ ఫలితాలు సాధించాలని విద్యార్థినులకు మంత్రులు సవిత, బాలవీరాంజనేయులు దిశా నిర్దేశం చేశారు. అనంతరం విద్యార్థులకు స్పోర్ట్స్ ట్రాక్ షూట్లు, షూస్ అందజేశారు.
















