హైదరాబాద్ : జోగులాంబ గద్వాల జిల్లాలోని ఎర్రవల్లి చౌరస్తా బీచుపల్లి వద్ద మూత పడిన బీచుపల్లి ఆయిల్ మిల్లును పునరుద్దరించాలని ఎంపీ మల్లురవి కోరారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఎంపీల సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. మిల్లును ఎప్పుడు పునరుద్దరిస్తారంటూ ప్రశ్నించారు. 7-8 నెలల్లో పునరుద్ధరణ పూర్తవుతుందని అధికారులు తెలిపారు. పార్లమెంట్‌లో ప్రశ్నలు వేయడానికి వీలుగా ఈ సమావేశాలు చాలా ముందుగా ఏర్పాటు చేయాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కోరారు. రాష్ట్రంలో పండే ధాన్యానికి తగిన మిల్లింగ్ సామర్థ్యం లేదని, స్టోరేజీ సమస్య ఉందని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రొటోకాల్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఎంపీలంతా ఏదో ఒక స్టాండింగ్ కమిటీ, కన్సల్టెన్సీ కమిటీల్లో సభ్యులుగా ఉంటారని, ఆ సమాచారం తీసుకొని ఆయా అంశాలకు సంబంధించిన పెండింగ్ విషయాలు తెలియజేస్తే సమావేశాల్లో తాము చర్చించేందుకు వీలుంటుందని ఎంపీ రామ సహాయం రఘురామిరెడ్డి అన్నారు. కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి డిజైన్లలోనే లోపాలున్నాయని.. ఈ అంశంపై నిపుణులతో కమిటీ వేసి అధ్యయనం చేయించాలని ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సూచించారు. సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీలు డాక్టర్ మల్లు రవి, ఈటల రాజేందర్, కడియం కావ్య, రామసహాయం రఘురామిరెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, చామల కిరణ్ కిమార్ రెడ్డి, రఘువీర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, అన్ని శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
















