న్యూఢిల్లీ : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. కేంద్ర సర్కార్ ను ఏకి పారేశారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్, ఎన్నికల సంఘం కలిసి దేశ ద్రోహానికి పాల్పడ్డాయని ఆరోపించారు. ఓటర్ల జాబితా సవరణ (సర్) ప్రక్రియపై ఎన్నికల సంఘంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయన్న నివేదిక నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఓటర్ల జాబితా సవరణకు సంబంధించిన నిర్ణయాలపై ఇద్దరు ఎన్నికల కమిషనర్లు అభ్యంతరాలు వ్యక్తం చేశారన్న నివేదిక తర్వాత బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ ,ఎన్నికల సంఘంపై “ఓట్ల దొంగతనం” దేశ ద్రోహానికి పాల్పడ్డారనే ఆరోపణలు చేశారు. ఇది రాజ్యాంగంపై ప్రత్యక్ష దాడి అని, దీనికి బాధ్యులైన బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ ఎన్నికల సంఘం దేశద్రోహానికి పాల్పడ్డాయని ఆయన పేర్కొన్నారు. ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు అన్నారు. ముగ్గురు సభ్యులున్న ఎన్నికల సంఘంలో, ఇద్దరు కమిషనర్లు—సుఖ్‌బీర్ సింగ్ సంధు , వివేక్ జోషి—ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ కు సంబంధించిన అంశాలపై పదేపదే ప్రశ్నలు లేవనెత్తారని ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ వెల్లడించిన తర్వాత గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు.
సర్ ప్రక్రియ దేశవ్యాప్త అమలు ముగ్గురు కమిషనర్ల పర్యవేక్షణలోనే జరుగుతోంది. అయితే, తమకు తెలియ కుండానే నిర్ణయాలు తీసుకున్నారని , ఆదేశాలు జారీ చేశారని ఆరోపిస్తూ సంధు , జోషి గత 10 నెలల్లో కనీసం 14 సార్లు (ఒకే రోజు నాలుగు సార్లు సహా) అధికారికంగా అభ్యంతరాలు వ్యక్తం చేశారని ఆ ఆంగ్ల దినపత్రిక నివేదిక పేర్కొంది. “ఓట్ల దొంగతనం అనేది భారత ప్రజలకు వ్యతిరేకంగా చేసే నేరం , మన రాజ్యాంగంపై ప్రత్యక్ష దాడి,” అని గాంధీ అన్నారు. “దీనికి బాధ్యులైన బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ , ఈసీ దేశద్రోహానికి పాల్పడ్డాయి. న్యాయం జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తాము పాల్పడుతున్న చర్య దేశ ద్రోహమని, దీనికి తగిన మూల్యం చెల్లించు కోవాల్సి ఉంటుందని ఎన్నికల సంఘం అధికారులను గతంలో హెచ్చరిస్తూ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను కూడా గాంధీ పంచుకున్నారు.
