అమరావతి : ఎంతగా టెక్నాలజీ వచ్చినా , మార్పులు చోటు చేసుకున్నా తెలుగు భాషకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఏపీలోని గుంటూరు జిల్లా కేంద్రంగా జరుగుతున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభల సందర్బంగా సోమవారం ముఖ్య అతిథిగా హజరయ్యారు ముఖ్యమంత్రి. ఈ సందర్బంగా ఆయన ప్రసంగించారు. సినిమా ఈవెంట్లకు వచ్చినట్టుగా 3వ ప్రపంచ తెలుగు మహా సభలకు పెద్ద ఎత్తున జనం రావడం సంతోషంగా ఉందన్నారు. మాతృ భాషకు ఇచ్చే గౌరవ వందనమే ప్రపంచ తెలుగు మహాసభలు ముఖ్య ఉద్దేశమన్నారు. తెలుగువారి ఆత్మ గౌరవాన్ని చాటి చెప్పిన ఎన్టీఆర్ పేరుతో వేదిక ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు చంద్రాబు నాయుడు.
వందలాది భాషలు ఉన్నా కేవలం ఆరు భాషలకు ప్రాచీన హోదా లభించిందని, అందులో తెలుగు భాష ఉండడం గర్వ కారణంగా ఉందన్నారు. ప్రపంచంలో 10 కోట్ల మంది తెలుగు మాట్లాడుతున్నారని చెప్పారు. ఈ సమావేశానికి కూడా 40 దేశాల నుంచి ప్రతినిధులు రావడం హర్షించదగ్గ విషయం అన్నారు నారా చంద్రబాబు నాయుడు. కవిత్రయం నుంచి అష్ట దిగ్గజాల వరకు గురజాడ నుంచి శ్రీశ్రీ, దాశరధి వరకు ఎందరో మహానుభావులు తెలుగు భాష కోసం పని చేశారని, తెలుగు వైభవం చాటారని ప్రశంసించారు. వేమన, సుమతీ, భాస్కర పద్యాలు మరిచి పోలేం అన్నారు. పిల్లలకు తెలుగు భాష పట్ల మమకారం పెంచేలా చేయాలని పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి. తెలుగు భాష ఎక్కడికీ పోదు… శాశ్వతంగా నిలిచే ఉంటుందన్నారు.

















