న్యూఢిల్లీ : భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీ-ఎన్‌సిఆర్ ప్రాంతంలో నిరంతరంగా పౌర, పర్యావరణ సవాళ్లపై దాఖలైన కేసులో బుధవారం విచారణ చేపట్టింది ఈ సందర్బంగా నిప్పులు చెరిగింది. సంబంధిత అధికారులను తీవ్రంగా మందలించింది. ప్రధానంగా టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ రద్దీ ఏర్పడడంతో పాటు వాయు కాలుష్యం పెరుగుతుండడం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. ఇందులో భాగంగా ఢిల్లీ సరిహద్దు టోల్ పాయింట్ల వద్ద తరచుగా ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడటంపై సుప్రీంకోర్టు జాతీయ రహదారుల అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ)కి నోటీసులు జారీ చేసింది.
రద్దీని తగ్గించడానికి ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసిడి) తొమ్మిది టోల్ బూత్‌లను ఎన్‌హెచ్‌ఏఐ నిర్వహించే ప్రదేశాలకు మార్చడాన్ని అన్వేషించాలని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. టోల్ ఆదాయంలో కొంత భాగాన్ని పౌర సంస్థతో పంచు కోవచ్చని సూచించింది. దీంతో పాటు రద్దీని తగ్గించాలని ధర్మాసనం NHAIని కోరింది. వాయు నాణ్యత సమస్యపై, ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో కాలుష్యాన్ని నియంత్రించడానికి అధికారులు ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు పూర్తిగా విఫలం అయ్యాయని మండిపడింది. భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం అర్ధవంతమైన మెరుగుదలకు తాత్కాలిక, స్వల్పకాలిక చర్యలు కాకుండా దీర్ఘకాలిక ప్రణాళిక అవసరమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
