కరీంనగర్ జిల్లా : కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పటేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో వారం రోజుల పాటు ఉత్సాహంగా జరిగిన “ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవ్” క్రీడా పోటీల ముగింపు సందర్భంగా విజేతలకు బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో క్రీడల ప్రస్తుత దుస్థితి చాలా దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిభ ఉన్న క్రీడాకారులు రాణించలేక పోవడం చాలా బాధాకరం అన్నారు. హెచ్‌సీఏ (HCA) లాంటి సంస్థల్లో ప్రతిభకు కాకుండా పైరవీలకు, డబ్బులకు పెద్దపీట వేస్తూ ఆటగాళ్లను సెలెక్ట్ చేస్తున్న దుర్మార్గపు సంస్కృతికి తక్షణమే చరమ గీతం పాడాల్సిన అవసరం ఉందన్నారు బండి సంజయ్ కుమార్ పటేల్.
ఇలాంటి పరిస్థితులను రూపుమాపి, నిజమైన ప్రతిభకు పట్టం కట్టాలనే లక్ష్యంతోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాబోయే దశాబ్ద కాలానికి ‘ఖేలో ఇండియా మిషన్’ను ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నారని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో దాగిన క్రీడా ఆణిముత్యాలను వెలికి తీయడానికే ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఈ ‘సంసద్ ఖేల్ మహోత్సవ్’ నిర్వహిస్తున్నాం అని ప్రకటించారు. రాబోయే రోజుల్లో క్రీడాకారులకు అధునాతన మౌలిక సదుపాయాలు, స్పోర్ట్స్ సైన్స్‌ను కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున అందుబాటులోకి తేనుందని వెల్లడించారు బండి సంజయ్ కుమార్ పటేల్. ఆధునిక కాలంలో విద్య ఎంత అవసరమో, క్రీడలు కూడా అంతే అవసరం అని అన్నారు. ఇవి యువతలో ఆత్మవిశ్వాసాన్ని, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని చెప్పారు.
