తిరుపతి : టీటీడీ విశ్రాంత చైర్మన్ , దివంగత డా. ఎన్. రమేశన్ అందించిన సేవలు, ఆయన రచనలు భావితరాలకు స్ఫూర్తి దాయకమని టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి కొనియాడారు.తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఈ సంస్మరణ సభ ఘనంగా జరిగింది. పలువురు ప్రముఖులు ఆయనతో తమకున్న అనుబంధాన్ని, పరిపాలన, చరిత్ర, పురావస్తు, ఆధ్యాత్మిక రంగాల్లో ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు .ఉద్యోగంలో చేరిన తర్వాత చాలామంది చదవడం, కొత్త విషయాలు నేర్చుకోవడం తగ్గిస్తారని, కానీ డా. రమేశన్ జీవితాంతం నిరంతర అధ్యయనానికి, జ్ఞాన సముపార్జనకు ప్రాధాన్యత ఇచ్చారని అదనపు ఈవో తెలిపారు. ఆయనను “మ్యాన్ ఆఫ్ ఇంటెలెక్ట్”గా అభివర్ణించడం ఎంతో సముచితమన్నారు.
డా. రమేశన్ రచించిన ‘తిరుమల టెంపుల్’ గ్రంథం ఆయన అపారమైన అధ్యయనానికి, మేధస్సుకు నిదర్శనమని వక్తలు ప్రశంసించారు. కేవలం ఏడాది వ్యవధిలోనే లోతైన పరిశోధనతో రచించారని తెలిపారు. ఆలయ చరిత్ర, నిర్మాణ శైలి, మండపాలు, శాసనాలు, నాణేలు, పూజా విధానాలు, పరిపాలన, పన్నుల విధానం, అకౌంటింగ్ పద్ధతులు, రాజుల చరిత్ర వంటి అంశాలను సరళమైన ఆంగ్లంలో వివరించారని చెప్పారు. ఈ గ్రంథాన్ని తెలుగులోకి అనువదించి ప్రచురిస్తే ఉద్యోగులు, అధికారులు, సభ్యులు, సామాన్య భక్తులకు ఎంతో ప్రయోజనకరం కలుగుతుందన్నారు. టీటీడీ చైర్మన్గా ఆయన చేపట్టిన విరాళాల సేకరణ, కాటేజీల నిర్మాణం, వివిధ ట్రస్టుల అభివృద్ధికి చేసిన కృషి సంస్థ ప్రగతికి బలమైన పునాదులుగా నిలిచాయని వక్తలు పేర్కొన్నారు. ఆనాటి మహనీయుల దూరదృష్టి, అంకితభావం ఫలితంగానే టీటీడీ నేడు ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక సంస్థగా ఎదిగిందని, వారందరికీ, వారి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు.
విశ్రాంత ఐఏఎస్ అధికారి గాయత్రి రామచంద్రన్ మాట్లాడుతూ డా. రమేశన్తో తమ కుటుంబానికి ఉన్న సుదీర్ఘ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన ఎంతో ప్రశాంతంగా, హుందాగా ఉండేవారని, కంచి కామకోటి పీఠ పరమాచార్య శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారిపై అపారమైన భక్తి కలిగి ఉండేవారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ క్యాడర్లో డా. రమేశన్, కృష్ణస్వామి రావు సాహెబ్ వంటి గొప్ప అధికారుల మార్గదర్శకత్వంలో పని చేయడం తన అదృష్టమన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆర్కియాలజీ మ్యూజియం డైరెక్టర్ అర్జున్ రావు మాట్లాడుతూ దక్షిణ భారతదేశ చరిత్ర, రాజుల పాలన, శాసనాలు, పురావస్తు సంపదపై డా. రమేశన్ చేసిన పరిశోధనలు ఎంతో విలువైనవన్నారు. చారిత్రక ఆధారాలను సేకరించి, భావితరాలకు అందించడంలో ఆయన విశేష కృషి చేశారని కొనియాడారు.



















