హైదరాబాద్ : ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో పట్టభద్రుల ఓటర్ల నమోదు ప్రక్రియను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్)ను బూత్ స్థాయిలో పార్టీ పట్టును బలోపేతం చేసే కార్యక్రమంగా భావించి క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లిలోని దుర్గా కన్వెన్షన్ హాల్‌లో తన అధ్యక్షతన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల కీలక సమావేశం జరిగింది. రాబోయే “హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్ నగర్” పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహాలు, సర్ ప్రక్రియ పురోగతిని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా క్యాడర్‌కు మంత్రి శ్రీధర్ బాబు దిశానిర్దేశం చేశారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలను పార్టీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందన్నారు. పాత, కొత్త నాయకులు సమన్వయంతో వ్యవహరించి ఈ ఎన్నికల్లో పార్టీ గెలుపునకు కృషి చేయాలని కోరారు.
ఎలాంటి భేదాభిప్రాయాలకు తావులేకుండా అందరూ ఐక్యంగా ముందుకు సాగాలని స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి పట్టభద్రుడు తప్పనిసరిగా ఓటరుగా నమోదు అయ్యేలా పార్టీ శ్రేణులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలన్నారు. పట్టభద్రుల్లో ఓటరు నమోదు ప్రాముఖ్యతపై విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా ఓటరు నమోదును చేపట్టాలని, బూత్ స్థాయిలోని ప్రతి గ్రాడ్యుయేట్‌ను పార్టీ శ్రేణులు కలిసేలా కార్పొరేషన్ల చైర్మన్లు, అసెంబ్లీ, పార్లమెంట్ బాధ్యులు, జిల్లా అధ్యక్షులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు. ఆ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం చేపడుతున్న ఎన్నికల హామీల అమలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని తెలిపారు.
అలాగే బీఆర్ఎస్, బీజేపీల వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కోరారు. క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులతో పాటు సంబంధిత పార్టీ బాధ్యుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక ఉంటుందని, ఈ విషయంలో తుది నిర్ణయం హైకమాండ్‌దేనని తేల్చి చెప్పారు. ప్రతి కార్యకర్త బూత్ స్థాయి నుంచి సమన్వయంతో పనిచేస్తూ, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో చేరేలా , తప్పులను సరిదిద్దేలా సర్ ప్రక్రియపై పూర్తి అప్రమత్తతతో వ్యవహరించాలని పేర్కొన్నారు.
