చెన్నై : సీఎం జోసెఫ్ విజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు పోలీస్ వ్యవస్థపై. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయ్యిందంటూ విపక్షాలు పెద్ద ఎత్తున శాసన సభలో ఆందోళనకు దిగాయి. సోమవారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే రాష్ట్రంలో వరుస హత్యలు, క్షీణిస్తున్న శాంతిభద్రతల పరిస్థితిపై చర్చ చేపట్టాలని కోరుతూ డీఎంకే సభ్యులు నినాదాలు చేయడంతో సభలో గందరగోళం నెలకొంది. సభను ఉద్దేశించి ప్రసంగించారు సీఎం. పోలీసులు మంచి వారికి మిత్రులుగా, చెడ్డ వారికి శత్రువులుగా” ఉండాలని చట్టం అందరికీ సమానమని నొక్కి చెప్పారు. రాజకీయ అనుబంధంతో సంబంధం లేకుండా నేరానికి పాల్పడే ఎవరి పైనైనా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఈ సభలో నేను ఒక ముఖ్యమైన విషయాన్ని నమోదు చేయాలని అనుకుంటున్నాను – పోలీస్ శాఖ విషయానికొస్తే, అది మంచి వారికి మిత్రులుగా, చెడ్డ వారికి శత్రువులుగా ఉండాలి. చట్టం అందరికీ సమానం. ఎవరు నేరం చేసినా, పార్టీలతో సంబంధం లేకుండా చర్యలు తీసుకుంటాం. అదే మా విధానం అని సీఎం విజయ్ అన్నారు.
పోలీసులు అధికార కేంద్రంగా మారకూడదని, ప్రజలను రక్షించేవారిగా ఉండాలని విజయ్ పేర్కొన్నారు. గత మూడు నెలల్లో నమోదైన నేరాల గురించి ప్రస్తావిస్తూ అవి అకస్మాత్తుగా జరగలేదని, పాత కక్షలు ప్రతీకార చర్యలే వాటికి కారణమని ఆయన చెప్పారు. రాష్ట్రంలో మాదకద్రవ్యాల సంస్కృతిని అంతం చేయడానికి తాను దృఢ సంకల్పంతో ఉన్నానని చెప్పిన ఆయన, కోయంబత్తూరులోని ఒక కళాశాలలో విద్యార్థి హత్యకు సంబంధించి 36 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. పోలీసు శాఖకు ఒక కొత్త కోణాన్ని తీసుకు రావాలని నేను కోరుకుంటున్నాను. కోయంబత్తూర్ కళాశాలలో ఒక విద్యార్థి హత్యకు సంబంధించి 36 మందిని అరెస్టు చేశారు. ప్రతి నేరం వెనుక అనేక కారణాలు ఉంటాయి. అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని నిందించడానికి ప్రతిపక్ష పార్టీలు ఇటువంటి పరిస్థితులను వాడుకుంటాయి. యువతకు ఒక సోదరుడిగా తమిళనాడులో మాదకద్రవ్యాల సంస్కృతికి (డ్రగ్ కల్చర్) ముగింపు పలకాలని నేను దృఢ నిశ్చయంతో ఉన్నాను అని ముఖ్యమంత్రి అన్నారు.
