అమరావతి : రైతు నేస్తం ఫౌండేషన్ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని కొనియాడారు మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు. సోమవారం రైతు నేస్తం ఫౌండేషన్ పదవ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. యడ్లపల్లి వెంకటేశ్వరరావుకి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆహార దాతలందరికీ నా శుభాకాంక్షలు తెలియ జేస్తున్నానని పేర్కొన్నారు. ఇదే వేదికపై నుండి ఔషధ మొక్కలను పంపిణీ చేయడం ఆనందంగా ఉందని అన్నారు వెంకయ్య నాయుడు . ఇక్కడి పొలాన్ని సందర్శించి, వారు అనుసరించే సాంప్రదాయ సేంద్రియ వ్యవసాయ పద్ధతుల గురించి తెలుసు కోవడం నాకు చాలా సంతోషాన్న కలిగించిందని చెప్పారు. గత కొంత కాలంగా వెంకటేశ్వరరావు రైతులకు ఆధునిక పద్ధతుల్లో సాంప్రదాయ వ్యవసాయ పద్ధతులను బోధిస్తూనే, వార్షిక రైతునేస్తం అవార్డులతో సత్కరిస్తున్నారని, ఇలా చేయడం మామూలు విషయం కాదన్నారు.
ప్రపంచం 2023 సంవత్సరాన్ని చిరు ధాన్యాల సంవత్సరంగా గుర్తించిందని చెప్పారు ముప్పవరపు వెంకయ్య నాయుడు. ఈ సందర్భంగా చిరుధాన్యాల గురించి అవగాహన కల్పించడానికి రైతు నేస్తం చేసిన ప్రయత్నాలు ప్రశంసనీయం అని పేర్కొన్నారు. కేవలం వ్యవసాయం, సాగు చేయడమే కాకుండా, మనం రైతులుగా, వ్యాపారవేత్తలుగా కూడా మారాల్సిన అవసరం ఉందన్నారు. ఆ దిశగా ప్రయత్నం చేయాలని కోరారు. వారి పంటకు సరైన గిట్టుబాటు ధర లభించేలా ఆధునిక పద్ధతులను అందించాలని సూచించారు వెంకయ్య నాయుడు. ఈ విషయంలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి భారత ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు . ఇప్పుడు చిరుధాన్యాలతో పాటు ప్రకృతి సిద్ధంగా పండించిన పంటలకు ఎంత డిమాండ్ ఉందో రైతులు తెలుసుకుంటారని తెలిపారు.















