కృష్ణా జిల్లా : పోరంకి లోని శ్రీ చైతన్య కాలేజీలో చదువుకుంటున్న 17 ఏళ్ల ఇంటర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్ మొల్లి పవన్ కుమార్ ఆత్మహత్య కేసు కీలక మలుపు తిరిగింది. తోటి విద్యార్థులు దాడి చేయడం, ఆపై దాడి దృశ్యాలను రికార్డ్ చేసి వీడియోను సామాజిక వేదికల్లో షేర్ చేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు మృతుడు పవన్ కుమార్. తనపై దాడికి పాల్పడిన ప్రతి ఒక్కరి పేరును తన చేతిపై రాసుకున్నాడు. ఈ విషయం గుర్తించిన ప్రిన్సిపాల్ సహాయకులు, లెక్చరర్లకు వాటిని తుడిపి వేయాలని ఆదేశించాడు. పవన్ కుమార్ సూసైడ్ కు సంబంధించి విషయం బయటకు రాకుండా ఉండేందుకు ప్లాన్ చేశారు. ఆపై పోలీసులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ఆస్పత్రికి తరలించారని పెనమలూరు డీఎస్పీ చలసాని, సీఐ వెంకటరమణలు వెల్లడించారు.
ఆదివారం డీఎస్పీ, సీఐలు మీడియాతో మాట్లాడారు. కీలక ఆధారాలు వెల్లడించారు . మొల్లి పవన్ కుమార్ పోరంకి లోని శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. మృతుడి స్వస్థలం బుచ్చయ్యపేట మండలం లింగభూపాలపుర అగ్రహారం. ఇదిలా ఉండగా తనను చదువుకుంటున్న సమయంలో హేమంత్ అనే తోటి స్టూడెంట్ తో గొడవ జరిగింది. ఇద్దరూ దూరంగా ఉంటున్నారు. హేమంత్ తో మాట్లాడ వద్దంటూ పవన్ కుమార్ తోటి విద్యార్తులకు సూచించాడు. దీంతో కోపంతో తనను గదికి పిలిపించి హేమంత్ స్నేహితులు పవన్ పై దాడికి పాల్పడ్డారు. మనస్తాపానికి గురై సూసైడ్ చేసుకున్నాడు . దీంతో ఈ కేసులో ముఖ్య పాత్ర పోషించిన ప్రిన్సిపాల్ తో పాటు ఫ్లోర్ ఇన్ ఛార్జి రవీంద్ర, మెస్ నిర్వాహకులు హేమంత్, రాజేష్ , జూనియర్ లెక్చరర్లు ఆనంద్, కృష్ణ తో పాటు దాడికి పాల్పడిన వారిని మొత్తం 12 మందిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు డీఎస్పీ, సీఐలు.















