తిరుమల : తిరుమల భక్త బాంధవులతో కిట కిట లాడుతోంది. శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంఆ అశ్వ వాహనంపై కల్కి అలంకారంలో శ్రీ మలయప్ప స్వామివారు భక్తులకు దివ్య దర్శనమిచ్చారు .గజ రాజుల గంభీర నడకలు, మంగళ వాయిద్యాల మధుర నాదాలు, భక్తజనుల భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోషతో అశ్వ వాహన సేవ వైభవంగా సాగింది. అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పిస్తూ స్వామి వారిని దర్శించుకుని భక్తి పారవశ్యంలో మునిగి పోయారు.
సనాతన ధర్మంలో అశ్వం వేగానికి, శక్తికి, చైతన్యానికి ప్రతీక. ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలతో పోల్చి, వాటిని అదుపులో ఉంచుకోవాల్సిన ఆవశ్యకతను బోధించాయి. అశ్వ వాహనంపై విహరించే శ్రీ మహావిష్ణువు సమస్త ఇంద్రియాలకు నియామకుడని, మనిషి తన ఇంద్రియాలను నియంత్రించుకుంటూ ధర్మమార్గంలో పయనించాలని ఈ వాహనసేవ ఆధ్యాత్మిక సందేశాన్నిస్తుంది. కలియుగంలో అధర్మాన్ని రూపుమాపి, ధర్మాన్ని పునఃప్రతిష్ఠించే శ్రీ మహా విష్ణువు కల్కి అవతార స్వరూపాన్ని ఈ అలంకారం స్ఫురింప జేస్తుంది. కలిదోషాలకు దూరంగా ఉంటూ, భగవన్నామ స్మరణ, నామ సంకీర్తన, ధర్మాచరణను ఆశ్రయిస్తే ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించ వచ్చనే సందేశాన్ని స్వామివారి అశ్వవాహన సేవ భక్తులకు అందిస్తుంది. ధర్మరక్షణ, దుష్టశిక్షణ, శిష్టరక్షణలో పరమాత్మ సంకల్పాన్ని స్మరింపజేస్తూ భక్తులలో భక్తి, ధర్మనిష్ఠలను పెంపొందిస్తుంది.
ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, టీటీడీ ఛైర్మన్ బీ.ఆర్. నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవో ప్రభల గోపీనాథ్, బోర్డు సభ్యులు నన్నపనేని సదాశివరావు, పూర్ణ సాంబశివరావు, ఆనంద్ సాయి, నరేష్ కుమార్, సీవీఎస్వో కేవీ మురళీకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
