చిత్తూరు జిల్లా : సకల సంపదలకు అధిష్ఠాత్రి అయిన శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కోసం టీటీడీ ఆధ్వర్యంలో కుప్పంలో నిర్వహించిన శ్రీ మహాలక్ష్మీ దీపోత్సవం భక్తిభావంతో వైభవంగా జరిగింది. పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు, భక్తజనం పాల్గొని దీపాలు వెలిగించి సామూహికంగా అమ్మవారికి దీపారాధన చేశారు. వేదమంత్రాలు, అన్నమాచార్య సంకీర్తనలు, దీపకాంతులతో పూజా ప్రాంగణం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లింది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి శ్రీమతి నారా భువనేశ్వరి ఈ కార్యక్రమానికి సామాన్య భక్తురాలిగా హాజరై, ఇతర భక్తులతో కలిసి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. భక్తులతో మమేకమై శ్రీ మహాలక్ష్మీ అమ్మ వారిని పూజించారు. దీపం అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞానజ్యోతిని వెలిగించే పవిత్ర ప్రతీక అని టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు. టీటీడీ, హిందూ ధర్మ ప్రచార పరిషత్ (హెచ్డీపీపీ), శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్వీబీసీ) సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ దీపోత్సవం మహిళా భక్తులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి, వారిలో భక్తిభావాన్ని పెంపొందించడంతో పాటు సనాతన ధర్మ సంప్రదాయాలను విస్తృతంగా ప్రచారం చేస్తోందన్నారు.
దీపోత్సవం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు ఐదుసార్లు నిర్వహించినట్లు తెలిపారు. భక్తులందరూ కలసి సామూహికంగా పూజలు నిర్వహించడం ద్వారా ఆధ్యాత్మిక ఐక్యత పెరుగుతుందని, శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి అనుగ్రహంతో ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, శుభాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. టీటీడీ, హెచ్డీపీపీ, ఎస్వీబీసీ సంయుక్త ఆధ్వర్యంలో ప్రతి నెలా శ్రీ మహాలక్ష్మీ దీపపూజ నిర్వహిస్తున్నట్లు టీటీడీ జేఈవో డా. ఎ. శరత్ తెలిపారు. విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ పవిత్ర పూజలో భక్తులు అర్చకుల సూచనల మేరకు శ్రద్ధాభక్తులతో పాల్గొని శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమానికి భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు.
మహిళా భక్తులకు అందించిన పూజా కిట్లో 24 రకాల పూజా సామగ్రి ఉన్నట్లు తెలిపారు. శ్రీ పద్మావతీ అమ్మవారి కుంకుమ, అక్షింతలు, పండ్లు, పూలు, మంగళసూత్రం, కంకణాలు తదితర వస్తువులను పూజ అనంతరం అందజేసినట్లు వివరించారు. పూజ అనంతరం భక్తులపై పవిత్ర జలాలతో సంప్రోక్షణ చేసి, అమ్మవారికి నివేదించిన ఐదు రకాల ప్రసాదాలను పంపిణీ చేసినట్లు తెలిపారు. భక్తులందరూ శ్రీ మహాలక్ష్మీ అమ్మవారిని భక్తిశ్రద్ధలతో ఆరాధించి ఆమె దివ్యానుగ్రహాన్ని పొందాలని సూచించారు. దీపం జ్ఞానానికి, పవిత్రతకు, శుభానికి ప్రతీక. శ్రీ మహాలక్ష్మీ అమ్మవారిని దీపాలతో ఆరాధించడం ద్వారా కుటుంబాల్లో సుఖశాంతులు, ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం వెల్లివిరియాలని భక్తులు ప్రార్థిస్తారు. ముఖ్యంగా మహిళలు కుటుంబ సంక్షేమం, సంతాన శ్రేయస్సు, సౌభాగ్యం కోసం ఈ పూజను భక్తితో నిర్వహిస్తారు.
ఈ సందర్భంగా ఆగమ సలహాదారులు శ్రీ శ్రీనివాసాచార్యులు శ్రీ మహాలక్ష్మీ దీపపూజ ప్రాశస్త్యాన్ని వివరించారు. అనంతరం తిరుమల శ్రీవారి ఆలయ అర్చకులు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివారికి, శ్రీ చతుర్భుజ మహాలక్ష్మీ అమ్మవారికి వైఖానస ఆగమశాస్త్రోక్తంగా విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, శ్రీనివాసార్చన నిర్వహించారు. వేద పండితులు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేశారు. అనంతరం శ్రీ మహాలక్ష్మీ అమ్మవారికి విశేష పూజలు సమర్పించారు. అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు ఆలపించిన భక్తి సంకీర్తనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం అర్చకులు భక్తులతో మూడుసార్లు దీపమంత్రాన్ని పలికించి, సామూహికంగా లక్ష్మీ నీరాజనం సమర్పించారు.
భక్తులందరూ ఒకేసారి దీపాలు వెలిగించి దీపారాధన చేయడంతో పూజా ప్రాంగణమంతా దీపకాంతులతో దేదీప్యమానంగా వెలిగిపోయింది. చివరగా నక్షత్రహారతి, కుంభహారతి సమర్పించారు. శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి అనుగ్రహంతో ప్రతి కుటుంబంలో ఐశ్వర్యం, ఆరోగ్యం, ఆనందం, శాంతి వెల్లివిరియాలని భక్తులు ప్రార్థించారు. బెంగళూరుకు చెందిన ఓ మహిళా భక్తురాలు మాట్లాడుతూ, కుప్పంలో నిర్వహిస్తున్న శ్రీ మహాలక్ష్మీ దీపోత్సవంలో పాల్గొనేందుకు ప్రత్యేకంగా వచ్చానని తెలిపారు. కుప్పంలో ఇంతటి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహించడం ఇక్కడి ప్రజల అదృష్టమని ఆనందం వ్యక్తం చేశారు.
