హైదరాబాద్ : అంతర్జాతీయ లఘు చిత్రోత్సవం తొలి ఎడిషన్ శుక్రవారం హైదరాబాద్ లో ఘనంగా ప్రారంభమైంది. ఈ ఫిలిం ఫెస్టివల్ ఈనెల 21వ తేదీ వరకు కొనసాగుతుంది. భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. భారతదేశంతో పాటు విదేశాల నుండి సుమారు 700 ఎంట్రీలు వచ్చాయి ఈ ఫెస్టివల్ లో ప్రదర్శన కోసం. కాగా ఎంపిక చేసిన జ్యూరీ కేవలం 60 షార్ట్ ఫిలింలను మాత్రమే ఎంపిక చేసింది. ఈ ఫెస్టివల్ దాదాసాహెబ్ ఫాల్కే స్కూల్ ఆఫ్ ఫిల్మ్ స్టడీస్ ఆధ్వర్యంలో దీనిని నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ ఎంపిక చేసిన చిత్రాలన్నీ హైదరాబాద్ లోని ప్రసాద్స్ మల్టీప్లెక్స్‌లోని స్క్రీన్ 4 , 5లో ప్రదర్శించనున్నారు.
తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ, తెలంగాణ ప్రభుత్వ సాంస్కృతిక, యువజన, పర్యాటక శాఖ సహకారంతో జరుగుతోంది. ఈ మూడు రోజుల ఉత్సవం కోసం భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ప్రముఖ చలనచిత్ర నిర్మాత , తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డు జ్యూరీ సభ్యుడు ఉమా మహేశ్వర రావు ఈ నిర్వాహక కమిటీకి పోషకులుగా ఉన్నారు. రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ముఖ్య అతిథిగా , పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గౌరవ అతిథిగా హాజరయ్యారు. అంతే కాకుండా తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ , నిర్మాత దిల్ రాజు, జూడీ గ్లాడ్ స్టోన్, మైథిలి రావు, నాగేశ్ కుకునూర్, లీమా దాస్, సుంజు, ఉత్పాల్ ఓర్సు వంటి ప్రముఖులు పాల్గొన్నారు.
