అమరావతి : మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం నారా చంద్రబాబు నాయుడుకు పాలనా పరంగా ఉన్న పట్టు ఏమిటో వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభం నిరూపించిందని అన్నారు. ప్రకాశం జిల్లా దోర్నాల మండలం, గంటవాని పల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా సోమవారం వెలిగొండ ప్రాజెక్ట్ మొదటి దశ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఇందుకు సంబంధించి దేవినేని ఉమ స్పందించారు. వెలిగొండ సొరంగం (టన్నెల్) నిర్మాణాన్ని దగ్గరుండి పరిశీలించారు. ఈ సందర్బంగా అద్భుతంగా ఉందంటూ ప్రశంసలు కురిపించారు.
కృష్ణా జలాల రాకతో వెలిగొండ వైపు పరుగులు తీయడంతో ప్రకాశం , మార్కాపురం జిల్లాల ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు అని పేర్కొన్నారు. ఆనాడు ఇదే సీఎం వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన చేతులతోనే ప్రారంభించడం కూడా గర్వకారణంగా ఉందన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజల మూడు దశాబ్దాల కల అయిన వెలిగొండ ప్రాజెక్ట్ సాకారం కావడం ఒక చారిత్రాత్మక ఘట్టంగా ఆయన అభివర్ణించారు .ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూరదృష్టి, సంకల్ప బలంతో వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తయిందన్నారు. కృష్ణా జలాలు నల్లమల సాగర్‌కు చేరుకున్నాయని సంతోషం వ్యక్తం చేశారు.
ఫీడర్ కెనాల్ గేట్లను ఎత్తి 10.7 టీఎంసీల నీటిని నల్లమల సాగర్‌లోకి విడుదల చేయడం, వెలిగొండ గేట్ల ద్వారా కృష్ణా జలాలు వదలడంతో ఈ ప్రాంతాల ప్రజలకు తాగు నీరు, రైతులకు సాగు నీరు అందుతోందన్నారు. మూడు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న కలను సాకారం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు.
