న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు బెంచ్‌లో ‘ప్రముఖ న్యాయ నిపుణుల’ నియామకం 76 ఏళ్లుగా జరగక పోవడంపై జస్టిస్ భుయాన్ ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగంలోని ఈ నిబంధన ఇప్పటికీ వినియోగంలోకి రాకుండా ఉండి పోవడం విచారకరమని ఆయన పేర్కొన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ఆదివారం అత్యున్నత న్యాయ స్థానంలో ‘ప్రముఖ న్యాయ నిపుణులను’ న్యాయమూర్తులుగా నియమించాలని గట్టిగా సమర్థించారు. అటువంటి నియామకాలు బెంచ్‌కు ప్రతిభతో కూడిన వైవిధ్యాన్ని తెస్తాయని, అలాగే పేరున్న విద్యావేత్తలు నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో తమవంతు సహకారం అందించే అవకాశం కల్పిస్తాయని ఆయన అన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 124 (3)(c) అటువంటి నియామకానికి అవకాశం కల్పించినప్పటికీ, గత 76 ఏళ్లలో హైకోర్టు న్యాయమూర్తులు లేదా ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాదులు తప్ప మరెవరూ సుప్రీంకోర్టుకు రాలేదని జస్టిస్ భుయాన్ విచారం వ్యక్తం చేశారు. న్యాయమూర్తి పదవికి “గంభీరంగా పరిగణించదగినంత లోతైన పరిజ్ఞానం” భారతీయ విద్యా రంగంలో లేదని కేంద్రం, కొలీజియం భావించి ఉండవచ్చని, లేదా ఈ రెండు వ్యవస్థలు ఇప్పటి వరకు ఈ నిబంధనను “సీరియస్‌గా పరిశీలించ లేదని” ఆయన వ్యాఖ్యానించారు.
న్యాయశాస్త్ర విద్యావేత్తలకు ఆచరణాత్మక అనుభవం లేదనే వాదనను “చాలా పైపైన చేసే అభ్యంతరం”గా జస్టిస్ భుయాన్ అభివర్ణించారు. అమెరికా, బ్రిటన్, కెనడా , కెన్యా వంటి అనేక దేశాలలో ప్రముఖ విద్యావేత్తలను రాజ్యాంగ న్యాయ స్థానాల న్యాయమూర్తులుగా నియమిస్తున్నారని ఆయన గుర్తు చేశారు. నేషనల్ లా యూనివర్సిటీ, ఢిల్లీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల కోసం జరిగిన 13వ స్నాతకోత్సవంలో జస్టిస్ భుయాన్ ప్రసంగించారు. రాజ్యాంగం అమలులోకి వచ్చి 76 ఏళ్లు దాటినప్పటికీ, ఇప్పటి వరకు సుప్రీంకోర్టుకు ఏ న్యాయ నిపుణుడూ నియమించ బడలేదు. రాజ్యాంగంలోని ఈ నిబంధన ఇప్పటికీ వినియోగంలోకి రాకుండా ఉండి పోవడం విచారకరం అని జస్టిస్ భుయాన్ అన్నారు. బెంచ్‌లో భాగమైతే గణనీయమైన కృషి చేయగలిగే అద్భుతమైన మేధావులు ఉన్నప్పటికీ, ఇప్పటి వరకు ఏ న్యాయశాస్త్ర విద్యావేత్తా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించ బడలేదు అని ఆయన జోడించారు.
దేశానికి నైతిక, చట్టపరమైన, రాజ్యాంగపరమైన అంతరాత్మ సంరక్షకురాలిగా సుప్రీంకోర్టు “సాంకేతిక అంశాలకు అతీతమైనది” అని విద్యావేత్తలు, న్యాయవాదులు , న్యాయపీఠం భారతదేశపు నిజమైన వైవిధ్యాన్ని ప్రతిబింబించాలని జస్టిస్ భూయాన్ నొక్కి చెప్పారు. ప్రతిభావంతులైన న్యాయమూర్తులతో న్యాయపీఠాన్ని వైవిధ్యభరితంగా మార్చడానికే ‘విశిష్ట న్యాయకోవిదుడు’ అనే నిబంధనను ఏర్పాటు చేశారు. వారి విద్యా నైపుణ్యంతో, ఈ వర్గానికి చెందిన విశిష్ట న్యాయ కోవిదులు సంకుచితమైన సాంకేతిక అంశాలకే పరిమితం కాకుండా, ప్రజా చట్ట సమస్యలను పరిష్కరించడంలో మరింత బలమైన స్థితిలో ఉంటారని విశ్వసించబడింది అని జస్టిస్ భూయాన్ అన్నారు.
