తాడేపల్లి గూడెం : మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నిప్పులు చెరిగారు ఏపీ కూటమి సర్కార్ నిర్వాకంపై. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులపై దాడి చేయడం దారుణమన్నారు. వారి డిమాండ్లపై ప్రభుత్వం చర్చలు జరపనప్పుడు ప్రజాస్వామ్యయుతంగా వారి గొంతును వినిపించడం నేరం ఎలా అవుతుంది? అని ప్రశ్నించారు. ఆందోళన చేస్తే ఈ రకంగా లాఠీలతో కొడతారా? మహిళలని చూడకుండా గాయపరుస్తారా? ఈడ్చి పడేస్తారా? శాంతియుత ఆందోళనలపై దాడులు చేసే అధికారం మీకు ఎవరిచ్చారు? ధర్నాకోసం వస్తున్న వారిని అడ్డుకుని పోలీస్‌స్టేషన్లలో నిర్భంధించి నరకయాతన పెడతారా? ధర్నా జరగనీయకుండా పెద్ద సంఖ్యలో ఉద్యోగులను అడ్డగోలుగా సస్పెండ్ చేయడం దారుణం కాదా? అని చంద్రబాబు నాయుడును నిలదీశారు. ఇది ప్రజాస్వామ్యమేనా? రోజురోజుకూ మీ నిరంకుశత్వం పెరిగిపోతోంది? అధికారం చేతిలో ఉందికదా అని ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని అనుకుంటే ఎలా? అని మండిపడ్డారు జగన్ రెడ్డి.
గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులే కాదు, ఇవాళ ఏ ఉద్యోగి అయినా రోడ్డెక్కుతున్నారంటే, కారణం మేనిఫెస్టోలో మీరు హామీలు ఇచ్చి, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఉద్యోగులందరికీ వెన్నుపోటు పొడవటమేనని గుర్తుంచు కోవాలని అన్నారు. మీరు అధికారంలోకి వస్తానే ఐ.ఆర్.అన్నారు, పీఆర్‌సీ అన్నారు. తీరా ఐ.ఆర్.లేదు, పీఆర్‌సీ లేదు. మేం పీఆర్సీ ఛైర్మన్‌ను నియమిస్తే వెళ్లగొట్టారు. ఉద్యోగులకు హక్కుగా ఇవ్వాల్సిన 5 డీఏలు పెండింగ్. ఉద్యోగులు రోడ్డెక్కితే, అప్పుడు అందులో 2 డీఏలు ఇస్తానని ప్రకటించి, ఏరియర్స్ చెల్లింపునకు కూడా వాయిదాలు పెట్టారని ఫైర్ అయ్యారు. తాము తీసుకొచ్చిన గ్రామ, వార్డు సచివాలయాలపై కక్ష గట్టారు. గ్రామ స్థాయిలోనే 54౦ కిపైగా సేవలందించిన, మా మానసపుత్రికలైన గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థ నిర్వీర్యమే లక్ష్యంగా, మీరు ఆ వ్యవస్థలపై నిరంతరం దాడి చేస్తూనే ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గ్రామ స్వరాజ్యం కనబడకుండా చేసేందుకు కుట్రలు పన్నుతూనే ఉన్నారు. ఒకే నోటిఫికేషన్‌తో దేశచరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 1.34 లక్షల శాశ్వత ఉద్యోగాలను, వాలంటీర్ల రూపంలో మరో 2.6 లక్షల ఉద్యోగాలను గ్రామ, వార్డు స్థాయిలో పారదర్శక పాలనకోసం మేం సృష్టిస్తే, హేతు బద్ధీకరణ పేరుతో శాశ్వతంగా 30వేల ఉద్యోగాలకు ఎసరు పెట్టడమే కాదు, వాలంటీర్లకు మేం ఇచ్చే రూ.5వేల జీతాన్ని, రూ.10 వేలు చేస్తామంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పి, తీరా అధికారంలోకి వచ్చాక వారికీ వెన్నుపోటు పొడిచారు. ఇప్పుడు వాలంటీర్లు అందించే సేవలనూ సచివాలయాల ఉద్యోగుల నెత్తిమీద పెట్టి, మోయలేని పనిభారాన్ని పెట్టారన్నారు. ఉద్యోగులపై చేసిన దాడులపై న్యాయ విచారణ జరిపించాలని జగన్ రెడ్డి డిమాండ్ చేశారు.
