అమరావతి : ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి తెలిపారు. ఉద్యోగులకు రావాల్సిన హక్కులు, సౌకర్యాల విషయంలో ఎక్కడా రాజీ పడకుండా, ఉద్యోగుల ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటూ ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు. గతంలో సీసీ రూల్స్, విధి విధానాలను పూర్తిస్థాయిలో పాటించకుండా కొన్ని నియామకాలు జరిగిన పరిస్థితులు ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగుల క్రమబద్ధీకరణ, రేషనలైజేషన్‌తో పాటు వారికి అందాల్సిన సౌకర్యాలను కల్పించడంపై దృష్టి సారించిందన్నారు.
ఉద్యోగులకు ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ అమలు చేయాల్సిన సమయంలో గత ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోలేదని, తమ ప్రభుత్వం ఉద్యోగుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతోందని తెలిపారు. అలాగే నోషనల్ ఇంక్రిమెంట్స్ వంటి అంశాలను కూడా ఉద్యోగుల ప్రయోజనాల కోణంలో పరిశీలిస్తున్నామని చెప్పారు. జీవో నంబర్ 11కు సంబంధించి కూడా గతంలో పంచాయతీ సెక్రటరీలు, వీఆర్వోలు తదితర కింది స్థాయి ఉద్యోగులు నిర్వహించే పనులకు సంబంధించి సిబ్బంది నియామకాలు చేపట్టిన పరిస్థితులు ఉన్నాయని మంత్రి వివరించారు. అదే సమయంలో ప్రజలకు అందే పౌర సేవలకు ఎలాంటి ఇబ్బంది కలగ కూడదన్నదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. ఉద్యోగులకు మరింత అనుకూలమైన విధానాలను అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు.
ఉద్యోగులు సెలవుల కోసం దరఖాస్తు చేసిన తర్వాత పై అధికారి నుంచి అనుమతి ఆలస్యమైనా, నిబంధనల మేరకు రెండు రోజుల క్యాజువల్ లీవ్ మంజూరయ్యే విధానాన్ని తీసుకొచ్చామని చెప్పారు. ఇది ఉద్యోగులకు మరింత సౌలభ్యాన్ని కల్పించే ఎంప్లాయ్ ఫ్రెండ్లీ విధానంలో భాగమని పేర్కొన్నారు. ప్రమోషన్ల విషయంలో కూడా ఉద్యోగులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని, సంబంధిత సెక్రటరీలతో సమన్వయం చేసుకుంటూ సమస్యలను పరిష్కరిస్తున్నామని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. ఉద్యోగులు, ప్రభుత్వం పరస్పర సఖ్యతతో ముందుకు సాగినప్పుడే ప్రజలకు మెరుగైన సేవలు అందించ గలుగుతామని మంత్రి పేర్కొన్నారు. ఉద్యోగుల సంక్షేమంతో పాటు ప్రజలకు నాణ్యమైన పౌర సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
