హైదరాబాద్ : ఖాతాదారులు, వినియోగదారులకు బిగ్ రిలీఫ్ దక్కింది. ఐబీఏతో చర్చల తర్వాత మూడు రోజుల సమ్మెను విరమించాయి బ్యాంక్ సంఘాలు. సోమవారం నుండి 30వ తేదీ వరకు జరగాల్సి ఉన్న మూడు రోజుల దేశవ్యాప్త సమ్మెలో బ్యాంక్ ఉద్యోగులు పాల్గొనరు. తమ ప్రధాన డిమాండ్లపై ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ నుండి హామీలు లభించడంతో బ్యాంక్ సంఘాలు సమ్మెను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నాయి. సంఘాల ప్రధాన డిమాండ్ ‘వారానికి ఐదు పని దినాలు’ అమలు చేయడం అంటే బ్యాంక్ ఉద్యోగులకు అన్ని శనివారాలు సెలవు దినాలుగా ప్రకటించడం. ప్రస్తుతం ప్రతి నెలా రెండవ ,నాల్గవ శనివారాల్లో మాత్రమే బ్యాంకులు మూసి వేయబడుతున్నాయి.
ఐబీఏ , యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ మధ్య జరిగిన చర్చల అనంతరం, మిగిలిన శనివారాల్లో సెలవుల డిమాండ్‌ను పరిశీలించడానికి ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నారు. బ్యాంక్ వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, ఈ కమిటీ సంబంధిత వర్గాలన్నింటితో కలిసి సాధ్యమయ్యే పరిష్కారాలపై చర్చిస్తుంది. ‘పనితీరు ఆధారిత ప్రోత్సాహక పథకం’ ఇతర పెండింగ్‌లో ఉన్న అంశాలకు సంబంధించి కూడా సంఘాలు తమ ఆందోళనలను వ్యక్తం చేశాయి. పీఎల్ఐ పథకంలో మార్పులకు సంబంధించి ఐబీఏతో చర్చలు ప్రారంభం కానున్నాయి. సమ్మె వాయిదా పడటంతో సెప్టెంబర్ 28 నుండి బ్యాంకులు తెరిచి ఉంటాయని భావిస్తున్నారు. దీనివల్ల ముందుగా అనుకున్నట్లుగా మూడు రోజుల పాటు సేవలకు అంతరాయం కలిగే పరిస్థితి ఉండదు.
