తిరుపతి జిల్లా : వైసీపీ ఎంపీ గురుమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు . కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన అధికారులను వేధించడం, ప్రతిపక్ష పార్టీలకు చెందిన వ్యక్తులపై బురద జల్లడం పరమావధిగా మారిందని ఆరోపించారు. టీటీడీ పరిపాలన పూర్తిగా గాడి తప్పిందని మండిపడ్డారు. దీనికి అనేక ప్రత్యక్ష నిదర్శనాలు ఉన్నాయని ఆయన అన్నారు. గత వైకుంఠ ఏకాదశి సందర్భంగా జరిగిన దురదృష్టకర ఘటనలో కొంతమంది భక్తులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ప్రభుత్వం ఎంక్వయిరీ కమిషన్ ఏర్పాటు చేసినప్పటికీ, ఏడాది గడిచినా ఇప్పటి వరకు ఆ నివేదిక వెలువడక పోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు.
అదే విధంగా తిరుమల, తిరుపతిలో వరుసగా భద్రతా లోపాలు చోటు చేసుకుంటున్నా పట్టించుకునే నాథుడే లేడని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు తమ పార్టీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వానికి ఈ భద్రతా లోపాలపై లేఖలు రాశారని, దానికి ప్రతిగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా కార్యాలయం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని వివరణ ఇవ్వాలని ఆదేశించిందన్నారు గురుమూర్తి. మా లేఖకు వివరణ ఇవ్వాలని ఆదేశించినప్పటికి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదని ధ్వజమెత్తారు.
















