అమరావతి : ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. ఆయన మాజీ సీఎం జగన్ రెడ్డిని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. రాయల సీమలో ఫ్యాక్షన్ రాజకీయాలకు కాలం చెల్లిందని, ఇప్పుడు అభివృద్ధే అజెండాగా మారిందన్నారు. ప్రజల విషయంలో తాను సౌమ్యుడినేనని, కానీ సంఘ విద్రోహ శక్తుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తానని హెచ్చరించారు. మరో రెండేళ్లలో తన రాజకీయ జీవితం 50 ఏళ్లు పూర్తవుతుందని, ఇలాంటి సమయంలో కూడా రౌడీలు, మాఫియాలతో రాజకీయాలు చేయాల్సి రావడం బాధాకరమన్నారు. రౌడీలు రాజకీయాల్లోకి వచ్చినందువల్లే వివేకానందరెడ్డి హత్య జరిగిందని, కోడికత్తి డ్రామా వచ్చిందని, వాటికి తనను బాధ్యుడిని చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మాస్క్ అడిగిన డాక్టర్‌ను చనిపోయేలా చేశారని, డ్రైవర్‌ను కారు డిక్కీలో పెట్టి డోర్ డెలివరీ చేశారని వ్యాఖ్యానించారు.
రాజధానిపై ప్రతిరోజూ కొత్త మాటలు మాట్లాడుతున్నారని, కేంద్రం చట్టం చేసిన తర్వాత రాజధానిని మార్చడం సాధ్యం కాదన్నారు. అమరావతి రాజధానిని తాము కోరుకుంటుంటే, వాటికన్ తరహాలో ‘మావిగన్’ కావాలని గొడ్డలి పార్టీ మాట్లాడుతోందని విమర్శించారు. గొడ్డలి పార్టీ అని తాము చెప్పడం కాదని, వారే అంగీకరిస్తున్నారని వ్యాఖ్యానించారు. కుప్పాన్ని ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌గా తీర్చిదిద్దుతామని, ఎలిఫెంట్ సఫారీ, రాక్ క్లైంబింగ్, ట్రెక్కింగ్ వంటి పర్యాటక ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. సుర్బానా జురాంగ్, ఐఐటీ కాన్పూర్ సహకారంతో కుప్పం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నామని చెప్పారు. సీఎస్సార్, పీ4 విధానాల ద్వారా పేదలను ఆదుకుంటూ కుప్పాన్ని దేశానికి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని చంద్రబాబు స్పష్టం చేశారు.
















