హైదరాబాద్ : హైదరాబాద్ లో భూకబ్జాలు , ఆక్రమణలకు పాల్పడిన వారిపై ఉక్కు పాదం మోపుతోంది హైడ్రా. ప్రభుత్వ ఆస్తులతో పాటు ప్రాణాలను కాపాడే పనిలో పడింది. హైడ్రా ఆపదమిత్ర పాత్ర పోషించింది. మీరాలం చెరువులో చిక్కుకున్న 9 మందిని హైడ్రా డీఆర్ఎఫ్ బృందం కాపాడింది. పాతబస్తీ జూ పార్కు దగ్గరలోని మీరాలం ట్యాంక్ లో చిక్కుకున్న వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చింది. వీరంతా మీరాలం ట్యాంక్ అభివృద్ధి పనుల్లో నిమగ్నమై ఉన్నవారు. మీరాలం ట్యాంక్ మీదుగా నిర్మించనున్న వంతెన కోసం సాయిల్ టెస్ట్ కు వెళ్లిన కార్మికులు , ఇంజనీర్లు. మీరాలం చెరువులోకి బోటు సాయంతో వెళ్లారు. సాయంత్రం చీకటి పడ్డాక తిరిగి రావాల్సి ఉండగా వాళ్ళు ప్రయాణించే బోటు ఇంజన్ ఫైల్ అయ్యింది. అప్పటికే చీకటి పడడంతో ఆందోళనకు గురయ్యారు. మెకానిక్ బృందానికి ఫోన్ చేయగా బోటు ఒడ్డుకు వస్తేనే ఇంజన్ మరమ్మత్తు చేయగలమని చెప్పారు.
బోటును మెల్లగా నెట్టుకొద్దామని ప్రయత్నిస్తే చెరువులో దట్టంగా వున్న గుర్రపు డెక్క బోటు ను ముందుకు కదలనీయలేదు. ఒకపక్క చెరువులో ఉన్న మొసళ్ల భయం, మరోపక్క ఒడ్డుకు చేరే అవకాశం లేక ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని భయాందోళనకు గురయ్యారు. ఈ తరుణంలో డయల్ 100కి ఫోన్ చేసి సమాచారం అందించారు. వెంటనే హైడ్రా డీఆర్ఎఫ్ కంట్రోల్ రూంకి ఫోన్ వచ్చింది. ఫోన్ అందు కోవడంతోనే అక్కడ మీరాలం చెరువు మధ్యలో చిక్కుకున్న వారితో హైడ్రా డీఆర్ఎఫ్ బృందం సభ్యులు మాట్లాడారు. హైడ్రా ఎస్ ఎఫ్ ఓ జమీల్ , హైడ్రా రెస్క్యూ టీమ్ ఇంచార్జి స్వామి నేరుగా మాట్లాడి మేము బోటు తో వస్తాం రాత్రి ఎంత టైమ్ అయినా మిమ్ములను సురక్షితంగా బయటకు తీసుకొస్తాం అని ధైర్యం చెప్పారు. ఆందోళన చెందవద్దని నిరంతరం వాళ్లతో మాట్లాడారు.
చీకటిగా ఉండడం గుర్రపు డెక్క ఎక్కువగా ఉండడంతో చెరువులో చిక్కుకున్న వారిని ఒడ్డుకు చేర్చడం కష్టమైంది. సెల్ ఫోన్ లైట్లతో చెరువులో చిక్కుకున్నవాళ్లు ఆచూకీ చెప్పగా, టార్చ్ లైట్లతో డీఆర్ఎఫ్ బృందాలు అతి కష్టమ్మీద అక్కడకు చేరుకున్నాయి. ముందుగా నలుగురిని డీఆర్ఎఫ్ బోటులో ఒడ్డుకు చేర్చారు. మిగిలిన వారిని కూడా తీసుకెళ్తాం కంగారు పడొద్దని చెప్పారు. రెండోసారి వెళ్లి మిగిలిన 5 గురుని తీసుకు వచ్చారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రాణాపాయ స్థితిలో వున్న తమను కాపాడిన హైడ్రా బృందాలకు ధన్యవాదాలు తెలిపారు. చాలా ఆందోళనకు గురయ్యాయమని.. నిరంతరం మాతో ఫోన్లో మాట్లాడుతూ ధైర్యం చెప్పడమే కాకుండా అర్ధరాత్రి వేళ తమని కాపాడారంటూ కితాబిచ్చారు.

















