పెద్ది సుద‌ర్శ‌న్ రెడ్డి మృతి పార్టీకి తీర‌ని లోటు

ఉద్య‌మ నాయ‌కుడిని కోల్పోవ‌డం బాధాక‌రం

hellotelugu-KTR

హైద‌రాబాద్ : తెలంగాణ ఉద్యమ సహచరులు, మాజీ ఎమ్మెల్యే , అంకితభావం కలిగిన ఉద్యమ నాయకులు పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం త‌న‌ను తీవ్ర దిగ్భ్రాంతికి, విషాదానికి గురి చేసింద‌న్నారు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన కోలుకుని తిరిగి ప్రజల మధ్యకు వస్తారని తాము ఆశతో ఎదురు చూశామన్నారు. కానీ, ఆయన ఇక మన మధ్య లేరన్న వార్త అత్యంత హృదయ విదారకమైనదని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన ఉద్యమంలో ఆయన పోషించిన పాత్ర చిరస్మరణీయమైనది. ఎంత చెప్పినా త‌క్కువేన‌ని పేర్కొన్నారు కేటీఆర్.

ఉద్యమ ఆశయాలను నమ్మి, జీవితాంతం ప్రజల పక్షాన నిలిచి, పార్టీ బలోపేతం కోసం అంకితభావంతో పనిచేసిన నాయకుడిగా పెద్ది సుదర్శన్ రెడ్డి ఎప్పటికీ గుర్తుండి పోతారని అన్నారు. త‌న మృతి భారత్ రాష్ట్ర సమితి పార్టీకే కాకుండా, తెలంగాణ సమాజానికి కూడా తీరని లోటు అని పేర్కొన్నారు కేటీఆర్. ఆయన ప్రదర్శించిన చిత్తశుద్ధి, ఉద్యమ స్ఫూర్తి పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని కొనియాడారు. ఎన్నో ఒత్తిళ్ల‌ను ఎదుర్కొని, మ‌రెన్నో కేసుల‌ను ఎదుర్కొని చివ‌రి దాకా పార్టీ కోసం, ప్ర‌జ‌ల కోసం త‌ను ప‌ని చేశార‌ని త‌నను కోల్పోవ‌డం త‌న‌కు వ్య‌క్తిగ‌తంగా తీర‌ని బాధ‌ను క‌లిగించింద‌న్నారు కేటీఆర్.

ఇదిలా ఉండ‌గా అనుకోకుండా పెద్ది సుద‌ర్శ‌న్ రెడ్డి హార్ట్ స్ట్రోక్ కు గుర‌య్యారు. ఆ వెంట‌నే త‌న‌ను హుటా హుటిన సికింద్రాబాద్ లోని య‌శోద ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. కొన్ని రోజుల పాటు ఆయ‌న ఆస్ప‌త్రిలోనే ఉంటూ నిన్న అర్ధ‌రాత్రి తుది శ్వాస విడిచారు. త‌న మృతి ప‌ట్ల మాజీ సీఎం కేసీఆర్ ఉద్య‌మ స‌హ‌చ‌రుడిని కోల్పోయాన‌ని పేర్కొన్నారు.

Exit mobile version