అమరావతి : ఏపీ పురపాలిక శాఖ మంత్రి పొంగూరు నారాయణ శనివారం అమరావతిలో పర్యటించారు. ఈ సందర్బంగా నిర్మాణంలో ఉన్న బంగాళాలను పరిశీలించారు. కీలక సూచనలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు నారాయణ. అమరావతి క్యాపిటల్ సిటీ లో ప్రధాన కార్యదర్శులు, మంత్రులు, న్యాయమూర్తుల, బంగ్లా లు చూడడం జరిగిందన్నారు. ఏప్రిల్ నెలాఖరు కల్లా ఈ భవనాలను అందజేస్తామని ప్రకటించారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. పనులు వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు పొంగూరు నారాయణ. మొత్తం 4026 భవనాలు, ఫ్లాట్ లు అమరావతి లో కడుతున్నామని తెలిపారు.
దీనిలో 186 బంగళాలు అందుబాటులోకి వస్తాయని అన్నారు మంత్రి పొంగూరు నారాయణ. బంగళాలు కాకుండా 3850 అపార్ట్మెంట్ మోడల్ లో నిర్మాణాలు చేపడుతున్నామని చెప్పారు. అనుకోకుండా ఈ ఏడాది వర్షాలు అధికం గా వచ్చాయన్నారు. దీని కారణంగా కొంచం ఆలస్యం జరిగిందని అన్నారు. ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టడంతో అన్ని పనులు ఊపందుకున్నాయని చెప్పారు. ఇదిలా ఉండగా మంత్రుల బంగళాలు చాలా వరకు పూర్తయ్యే దశలో ఉన్నాయని అన్నారు . జడ్జి బంగళాలు లో బ్రిక్ వర్క్, ప్లాస్టింగ్ తుది దశకు చేరాయని స్పష్టం చేశారు పొంగూరు నారాయణ. 500 నివాస సముదాయాలు మినహా మిగిలిన అన్ని మార్చి నెలాఖరు వరకు పూర్తి చేస్తామన్నారు.
ఈ భవనాలు అన్ని జీఏడి కి హ్యాండ్ ఓవర్ చేస్తామని, ఆ తర్వాత వారికి కేటాయిస్తారని చెప్పారు. సీడ్ యాక్సిస్ రోడ్ కు భూసేకరణ నోటిఫికేషన్ ఈ బుధవారం ఇస్తామని ప్రకటించారు. ఇంకా నాలుగున్నర ఎకరాలు రావాల్సి ఉందని, దీనిలో 2 ఎకరాలు ఇచ్చేందుకు సుముఖం గా ఉన్నారని తెలిపారు.















