ఢిల్లీ : తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ మీడియాతో మాట్లాడారు. పార్టీలో కీలకమైన సంస్కరణలు రావాల్సిన అవసరం ఉందన్నారు. అంతే కాకుండా పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు. తాను కూడా దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నానని చెప్పారు. తాజాగా తను చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. ఇదిలా ఉండగా తను ప్రాతినిధ్యం వహిస్తున్న తిరువనంతపురం కార్పొరేషన్ ఎన్నికల్లో ఎన్నడూ లేని రీతిలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగుర వేసింది. మేయర్ పదవిని దక్కించుకుంది. ఇది కాంగ్రెస్, కమ్యూనిస్టులకు మింగుడు పడని అంశం. గత కొంత కాలంగా శశి థరూర్ ప్రధాని మోదీతో, కేంద్రంతో సత్ సంబంధాలు కలిగి ఉంటున్నారు.
తాజాగా మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు శశి థరూర్. సంస్థను బలోపేతం చేయాలి, ఇందులో ఎలాంటి సందేహం లేదన్నారు. పార్టీ ఇందిరా భవన్ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో థరూర్ దిగ్విజయ్ సింగ్ పక్కనే కూర్చున్నారు. శనివారం నాడు నరేంద్ర మోడీ పాత చిత్రాన్ని పంచుకుంటూ, ఒక సాధారణ కార్యకర్త తమ నాయకుల పాదాల వద్ద కూర్చుని ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా ఎలా ఎదిగారో చెబుతూ, ఆర్‌ఎస్‌ఎస్-బీజేపీల సంస్థాగత శక్తిని ప్రశంసించడం ద్వారా సింగ్ కలకలం సృష్టించారు. ఇదే సమయంలో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడటానికి, దానిని అధికారం నుండి తొలగించడానికి క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ సంస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని శశి థరూర్ నొక్కి చెప్పారు.
