న్యూఢిల్లీ : కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తీసుకు వచ్చిన ఇథనాల్ 20 కి వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం న్యూఢిల్లీలో భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్బంగా ఆప్ చీఫ్ , మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో కార్యకర్తలు, నేతలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసాన్ని ముట్టడించేందుకు ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. ఆప్ చీఫ్ ను ప్రధాని నివాసం వద్దకు వెళుతుండగా తనను అడ్డుకునేందుకు యత్నించారు . దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్. E20 పెట్రోల్‌కు వ్యతిరేకంగా 2.3 లక్షలకు పైగా వినతిపత్రాలను సమర్పించేందుకు వెళ్తుండగా అడ్డుకోవడంతో ఆప్ నాయకులు రోడ్డుపై నిరసన చేపట్టారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడితోనే కేంద్రం ఈ20 ఇంధనాన్ని ప్రోత్సహిస్తోందని ఆరోపించారు కేజ్రీవాల్.
దానికి వ్యతిరేకంగా వినతిపత్రాలను సమర్పించేందుకు ఢిల్లీలోని పార్టీ కార్యాలయం నుండి ప్రధాని నివాసం వైపు సాగిన నిరసన ర్యాలీలో కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ బయలుదేరారు. తనతో పాటు ఇతర పార్టీ నాయకులను ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు, దీంతో వారు ఫిరోజ్ షా రోడ్డుపై నిరసన చేపట్టారు. పోలీసులు అడ్డుకున్న తర్వాత కేజ్రీవాల్, మాజీ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, నాయకుడు జాస్మిన్ షా , ఇతర పార్టీ నాయకులు రోడ్డుపైనే కూర్చున్నారు. E20 పెట్రోల్ విధానం వాహన యజమానులపై ప్రతికూల ప్రభావం చూపుతోందని ఆరోపిస్తూ, దేశవ్యాప్తంగా ప్రజల నుండి సేకరించిన వినతి పత్రాలను సమర్పించేందుకు ఆప్ 100 మందితో ఈ ర్యాలీని ప్రారంభించింది. ర్యాలీకి ముందు మద్దతుదారులను ఉద్దేశించి కేజ్రీవాల్ మాట్లాడారు. దేశవ్యాప్తంగా ప్రజల సంతకాలతో కూడిన 2.30 లక్షలకు పైగా వినతి పత్రాలను పార్టీ తీసుకువెళ్తోందని, కోట్ల మంది వాహన యజమానుల ఆందోళనలను ప్రభుత్వం ఆలకించాలని కేజ్రీవాల్ కోరారు.
