హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో హెచ్ – ఫాస్ట్ దాడులు చేపట్టారు. రసాయనాలు కలిపిన 25 టన్నుల సుగంధ ద్రవ్యాలు స్వాధీనం చేసుకోవడం కలకలం రేపింది. ఈ ఘటనలో ముగ్గురు అరెస్ట్ అయ్యారని సీపీ వీసీ సజ్జనార్. మానవ వినియోగానికి ప్రమాదకరమైన సింథటిక్ రసాయనాలు , రంగులు, అలాగే వస్త్రాలకు వాడే రంగులు, పారిశ్రామిక స్థాయి రంగులు, షైనింగ్ పౌడర్ (టాల్కమ్ పౌడర్) , రైస్ బ్రాన్ ఆయిల్ వంటి విషపూరిత పదార్థాలను సుగంధ ద్రవ్యాలలో కలుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ నేతృత్వంలో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని సుగంధ ద్రవ్యాల వ్యాపార , ప్రాసెసింగ్ కేంద్రాలపై జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ విభాగంతో కలిసి హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ సర్వైలెన్స్ టీమ్ బృందాలు విస్తృత తనిఖీలు నిర్వహించాయి. కల్తీకి వాడే ప్రమాదకర రసాయనాల వినియోగాన్ని అరికట్టడం, తప్పుడు లేబులింగ్ తొలగించడం, ఆహార భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించేలా చూడటం , ప్రజారోగ్యాన్ని రక్షించడం ఈ ప్రత్యేక చర్యల ముఖ్య ఉద్దేశ్యం అని స్పష్టం చేశారు వీసీ సజ్జనార్.
ప్రజల నుండి అందిన విశ్వసనీయ సమాచారం ఆధారంగా ఈ తనిఖీలు చేపట్టారు. ఈ ఆపరేషన్‌లో, సుగంధ ద్రవ్యాల సేకరణ, ప్రాసెసింగ్ , అమ్మకాలలో (టోకు లేదా చిల్లర) చురుకుగా ఉంటూనే, ప్రజారోగ్యానికి హాని కలిగించే చర్యలకు పాల్పడుతున్న 13 వ్యాపార సంస్థలు , కేంద్రాలను అధికారులు తనిఖీ చేశారు. దాడుల సమయంలో, ప్రమాదకర రసాయనాలు , హానికర పదార్థాలు కలిగిన మొత్తం 25 టన్నుల వివిధ రకాల సుగంధ ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి మూడు పోలీస్ స్టేషన్ల పరిధిలో మూడు క్రిమినల్ కేసులు నమోదు చేయబడ్డాయి . బాధ్యులైన ముగ్గురు వ్యక్తులను ఇప్పటివరకు అరెస్టు చేసినట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ మంగళవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు కేసులు, బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కేసు నమోదయ్యాయి.
అరెస్టు అయిన వారిలో కాటేదాన్‌కు చెందిన రాహుల్ భాటి, అలాగే బేగం బజార్‌కు చెందిన విశాల్ పన్వార్ ,దులిచంద్ కచ్చావార్ ఉన్నారు. సజ్జనార్ ప్రకారం, సమగ్ర తనిఖీలలో ఆహార భద్రత , ప్రమాణాల చట్టం, 2006ను ఆందోళనకరంగా పాటించక పోవడం, తప్పుడు లేబులింగ్ పద్ధతులు, మోసపూరిత ప్రాసెసింగ్ టెక్నిక్‌లు మాత్రమే కాకుండా, సులభంగా డబ్బు సంపాదించడానికి అధిక ధరకు అమ్మడం కోసం మసాలా దినుసులలో అత్యంత ప్రమాదకరమైన, విషపూరిత పదార్థాలను ఉపయోగించడం వంటి కొన్ని ప్రమాదకరమైన చర్యలు కూడా బయట పడ్డాయన్నారు సీపీ.
