పొన్నేరి : కాంగ్రెస్ చరిత్రే దేశ చరిత్ర. కాంగ్రెస్ పార్టీయే దేశానికి బలం అని అన్నారు కర్ణాటక పీసీసీ చీఫ్, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ . శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా తమిళనాడులోని పొన్నేరిలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా హాజరయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి దురై చంద్రశేఖర్‌కు మద్దతుగా టిఎన్‌సిసి అధ్యక్షుడు కె. సెల్వపెరుంతగై, ఎఐసిసి తమిళనాడు ఇన్‌చార్జ్ గిరీష్ చోడంకర్, మాజీ ఎంపీ డి.కె. సురేష్, , ఇతర సీనియర్ నాయకులతో కలిసి ఉండటం ఆనందంగా ఉందన్నారు డీకే శివకుమార్. కాంగ్రెస్ పార్టీ, దాని మిత్రపక్షాలు అధికారంలోకి వచ్చినప్పుడల్లా – సమాజంలోని అన్ని వర్గాలు అధికారంలోకి వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీ, డిఎంకెతో దశాబ్దాలుగా పొత్తును పంచుకుంటోందని చెప్పారు డీకే శివకుమార్. ఈ పొత్తులో సామాజిక న్యాయం, సమాఖ్య విలువలు, ప్రాంతీయ గర్వం, భాష పట్ల గౌరవం వంటి అంశాలు పాతుకు పోయాయని అన్నారు. ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ నాయకత్వంలో గత ఐదేళ్లుగా పటిష్టమైన పాలన, ప్రగతిశీల విధానాలు, రైతులు, మహిళలు, యువత , సమాజంలోని ప్రతి వర్గానికి ప్రయోజనం చేకూర్చే ప్రభావవంతమైన సంక్షేమ కార్యక్రమాలు చోటు చేసుకున్నాయని ప్రశంసలు కురిపించారు. కాంగ్రెస్-డిఎంకె కూటమి ప్రజోపయోగ పాలనలో, నేడు తమిళనాడు అభివృద్ధి, సామాజిక అభివృద్ధిలో అగ్రగామి రాష్ట్రాలలో ఒకటిగా నిలుస్తోందన్నారు. రాష్ట్ర సంక్షేమం, గౌరవం, పురోగతి మార్గంలో ఈ ప్రయాణాన్ని కొనసాగించడానికి, ప్రజలు మరోసారి కూటమికి మద్దతు తెలిపి, మన అభ్యర్థులకు ఓటు వేయాలని కోరారు డీకే శివకుమార్.
















