హైదరాబాద్ : రాష్ట్ర క్రీడా, మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన తాజాగా రాష్ట్రంలో చోటు చేసుకున్న మంత్రి కొండా సురేఖ వివాదంపై స్పందించారు. ఇది ఎవరికీ మంచిది కాదన్నారు. ఎవరైనా , ఎంతటి వారైనా సరే పార్టీ నియమ నిబంధనలకు కట్టుబడి ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. ఇవాళ వాకిటి శ్రీహరి జాతీయ మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మంత్రి సురేఖపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారని దీనిపై తాను స్పందించడం సరి కాదన్నారు.
పార్టీ ఉంటేనే మనం ఉంటామన్న సంగతి మరిచి పోతే ఎలా అని ప్రశ్నించారు. పార్టీ వల్లే మన ఉనికి ఉంటుంది. అటువంటి వ్యవస్థ లేనిదే ఏ పార్టీ కూడా పని చేయలేదన్నారు పార్టీయే అన్నింటికంటే ముఖ్యం, మిగిలినవన్నీ ఆ తర్వాతే. పార్టీకి అండగా ఉంటూ, దానితో కలిసి పనిచేస్తే మీరు ఉన్నత స్థాయికి చేరుకోగలరని ఆ విషయం గుర్తించాలని సూచించారు. ఇక ఎవరిపైనైనా చర్యలు తీసుకునే విషయానికి వస్తే, పార్టీలో క్రమశిక్షణ కమిటీ ఉంటుంది, అదే నిర్ణయం తీసుకుంటుందన్నారు. పార్టీ అనేది వంద శాతం అందరికీ చెందినది. ఎస్సీ, ఎస్టీ లేదా మరే ఇతర వర్గమైనా సరే, పార్టీ అందరినీ పరిగణనలోకి తీసుకుంటుందని అన్నారు వాకిటి శ్రీహరి. తప్పులు చేసేవారు లేదా పార్టీ విధానాలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు.

















