హైదరాబాద్ : తెలంగాణలో నెలకొన్న వ్యవసాయ కరువుకు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే కారణమని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత టి. హరీశ్ రావు ఆరోపించారు. గజ్వేల్ నియోజకవర్గంలో ఎండిపోయిన వరి పంటలను పరిశీలించారు. విద్యుత్ కొరత ‘ఎల్ నినో’ హెచ్చరికలను పట్టించుకోని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం బూరుగపల్లి గ్రామంలో ఎండిపోయిన వరి పొలాలను పరిశీలించి రైతులను పరామర్శించారు. వారికి భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. పంట కోతకు వచ్చే సమయానికి నీరు, విద్యుత్ లేక పంటలు ఎండిపోయి ఆవేదనలో ఉన్న రైతులను ఆయన ఓదార్చే ప్రయత్న చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోక పోవడం వల్లే ఖరీఫ్ సీజన్లో సుమారు 12 లక్షల ఎకరాల్లో పంటలు ఎండి పోయాయని ఆయన పేర్కొన్నారు. పది నెలల క్రితమే వ్యవసాయ శాస్త్రవేత్తలు ‘ఎల్ నినో’ గురించి స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసినప్పటికీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎటువంటి చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని విమర్శించారు.
పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లతో పోల్చినప్పుడు అక్కడ రైతులను ఆదుకునేందుకు మహారాష్ట్ర ఎకరాకు రూ. 5,000 ఆర్థిక సహాయం అందించగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరువు మండలాలను ప్రకటించిందని, కానీ తెలంగాణలో మాత్రం ఎటువంటి ఉపశమన చర్యలు చేపట్టలేదని ఆయన గుర్తు చేశారు. ఇతర రాష్ట్రాలు ముందుగానే విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకుని, బొగ్గు నిల్వలను సమకూర్చుకోగా, తెలంగాణ ప్రభుత్వం మాత్రం సరైన సమీక్షలు నిర్వహించడంలో లేదా ‘కోల్ ఇండియా లిమిటెడ్’తో సమన్వయం చేసుకోవడంలో విఫలమైందని మండిపడ్డారు. ,దీనివల్ల రైతులు విద్యుత్ సబ్స్టేషన్ల వద్ద పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన ఆరోపించారు.
అంతేకాకుండా ఆదిలాబాద్, నల్గొండ, మెదక్, కరీంనగర్, మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాల్లో పత్తి రైతులు తీవ్రంగా నష్ట పోయారని, ఎకరాకు పది క్వింటాళ్ల దిగుబడి రావాల్సిన చోట రెండు క్వింటాళ్ల కంటే తక్కువ దిగుబడి వచ్చిందని హరీశ్ రావు పేర్కొన్నారు. విద్యుత్ సరఫరా వైఫల్యాలకు సంబంధించి కింది స్థాయి అధికారులను సస్పెండ్ చేస్తామని ప్రభుత్వం బెదిరించడాన్ని ఆయన తప్పుబట్టారు. అసలైన బాధ్యత ముఖ్యమంత్రి, ఇంధన శాఖను నిర్వహిస్తున్న ఉప ముఖ్యమంత్రిదేనని ఆయన స్పష్టం చేశారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లోని ఐదవ యూనిట్‌ను ఇటీవల కాకుండా మరికొంత ముందుగానే అనుసంధానించి (సింక్రొనైజ్ చేసి) ఉంటే, తెలంగాణ అంతటా సాగులో ఉన్న పంటలు పూర్తిగా నాశనం కాకుండా కాపాడు కోగలిగేవారని ఆయన పేర్కొన్నారు.

















