తిరుపతి : అలిపిరి సమీపంలో నిర్మాణంలో ఉన్న శ్రీ పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రి నూతన భవనాన్నివేగంగా పూర్తి చేయాలని టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. శ్రీ పద్మావతి చిన్న పిల్లల హృదయాలయంను, నిర్మాణంలో ఉన్న నూతన భవనాన్ని శ్రీ పద్మావతి చిన్న పిల్లల ఆసుపత్రి వైద్యులు, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి టిటిడి ఈవో పరిశీలించారు. ఈ సందర్బంగా అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడారు. నూతన ఆసుపత్రి భవనం పూర్తి అయ్యే సమయానికి భవనానికి అవసరమయ్యే మానవ వనరులు, ఆపరేషన్ యంత్రాలు, ఫర్నీచర్, విద్యుత్ , తదితర మౌళిక సదుపాయాలను ముందస్తుగా సమకూర్చుకోవాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. కొత్తగా నిర్మిస్తున్న జీ + 6 నూతన ఆసుపత్రి భవనంలో వైద్య సేవలు, పరిపాలన కోసం ఒక్కొక్క ఫ్లోర్ లో ఏ ఏ అంతస్తును ఉపయోగిస్తున్నారని, ప్రతి ఫ్లోర్ ను పరిశీలించారు.
6వ ఫ్లోర్ లో పూర్తిగా ఆపరేషన్ ల కోసం వినియోగించనున్నట్లు, 7వ ఫ్లోర్ కేవలం హెలిపాడ్ కోసం ఉపయోగించనున్నట్లు వైద్యులు డా. ఎన్. శ్రీనాథ్ రెడ్డి వివరించారు. ఆసుపత్రిలో అక్కడక్కడా భక్తిభావం, మనో ధైర్యాన్ని రోగులకు, వారి సంరక్షకులకు నింపేలా ఆసుపత్రి గోడలకు దేవతా మూర్తుల చిత్రాలను అమర్చాలని స్పష్టం చేశారు ఈవో, పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు ఈవో అనిల్ కుమార్ సింఘాల్. ఆసుపత్రి నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేసి వీలైనంత త్వరగా నూతన ఆసుపత్రిని ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
