అమరావతి : ఏపీ అసెంబ్లీ సెక్రటేరియట్ రూపొందించిన 2026 సంవత్సర క్యాలెండర్, డైరీని సోమవారం ఆవిష్కరించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు సమక్షంలో ఉండవల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో 2026 క్యాలెండర్, టేబుల్ క్యాలెండర్, డైరీలను విడుదల చేశారు. ఈ సందర్బంగా ప్రత్యేకంగా స్పీకర్ ను అభినందించారు. ఇలాంటి ప్రయత్నం బాగుందన్నారు. జీవ వైవిద్యం-ఆంధ్రప్రదేశ్ సజీవ వారసత్వం అనే థీమ్‌తో క్యాలెండర్ రూపొందించడం ఆనందంగా ఉందన్నారు సీఎం. ఏపీలోని ప్రకృతి సంపద, కళలు, సంప్రదాయాలు, ఆధునిక సాంకేతికతలకు అద్దం పట్టేలా కొత్త సంవత్సరం క్యాలెండర్ రూపొందించడం బాగుందంటూ కితాబు ఇచ్చారు.
ఏపీలో ఉన్న వివిధ వన్యప్రాణుల గురించి అవగాహన కల్పించేలా నూతన సంవత్సర క్యాలెండర్ రూపకల్పన చేశారు. సాంప్రదాయ కలంకారీ కళాశైలిలో క్యాలెండర్లోని చిత్రాలు వచ్చేలా డిజైన్ చేయించారు. ఆంధ్రప్రదేశ్ జీవ వైవిధ్య వారసత్వాన్ని, సీఎం ఆలోచనలను చాటిచెప్పేలా 2026 క్యాలెండర్ ఉందన్నారు నారా చంద్రబాబు నాయుడు. 2026 సంవత్సరానికి చెందిన క్యాలెండర్ ను చక్కగా డిజైన్ చేశారంటూ పేర్కొన్నారు. ప్రకృతిని కాపాడు కోవాలనే మంచి సందేశంతో క్యాలెండర్ ఉందని ప్రశంసించారు. ఇదిలా ఉండగా క్యాలెండర్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. కార్యక్రమంలో పాల్గొన్నారు ఆర్థిక, శాసన సభా వ్యవహారాల శాఖా మంత్రి పయ్యావుల కేశవ్, అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ .
