బ‌డి బయ‌ట పిల్ల‌ల‌ను బ‌డుల్లో చేర్పించాలి

స్ప‌ష్టం చేసిన విద్యా శాఖ మంత్రి నారా లోకేష్

hellotelugu-APEducation

ఉండ‌వ‌ల్లి : బ‌డి బ‌య‌ట ఏ ఒక్క‌రు ఉన్నా వెంట‌నే గుర్తించి బడిలో పిల్ల‌ల‌ను చేర్పించేందుకు కృషి చేయాల‌ని పిలుపునిచ్చారు మంత్రి నారా లోకేష్. పాఠశాల విద్యపై మంత్రి లోకేష్ సమీక్షించారు. బడి ఈడు పిల్లలందరినీ ట్రాక్ చేసి పాఠశాలల్లో చేర్పించాలని మంత్రి లోకేష్ ఆదేశించారు. రాష్ట్రంలో ఇప్పటికీ బడిబయట ఉన్న 1,64,821 మంది పిల్లలను పూర్తి స్థాయిలో పాఠశాలల్లో చేర్పించేలా అధికారులు చొరవ చూపాలని స్పష్టం చేశారు. పాఠశాల విద్య డైరక్టర్ తమీమ్ అన్సారియా మాట్లాడుతూ ఈ ఏడాది 33 వేల మంది బడిబయట ఉన్న చిన్నారులను స్కూళ్లలో చేర్పించామని, మిగిలిన వారి వివరాలను కూడా లీప్ యాప్ ద్వారా ప్రధానోపాధ్యాయులకు పంపించామని చెప్పారు. బడి ఈడు పిల్లలు ప్రతి ఒక్కరినీ స్కూళ్లలో చేర్పించేలా తల్లిదండ్రులను చైతన్యవంతం చేసేలా చర్యలు తీసుంటున్నామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీచర్ అటెండెన్స్ గణనీయంగా పెరిగిందని, ప్రస్తుతం ఉపాధ్యాయుల హాజరుశాతం 98.97 శాతంగా ఉన్నట్లు చెప్పారు.

విద్యార్థుల హాజరు శాతాన్ని 85.41శాతంగా ఉందని, దీనిని కూడా పెంచేందుకు కృషి చేయాలని మంత్రి కోరారు. ఏదేని విద్యార్థి వరుసగా 3 రోజుల పాటు వరసగా పాఠశాలకు గైర్హాజరైతే తల్లిదండ్రులను స్కూళ్లకు పిలిపించి ఎడ్యుకేట్ చేయాలని అన్నారు. ఈ విషయంలో స్కూలు మేనేజ్ మెంట్ కమిటీలకు కూడా బాధ్యతలు అప్పగించాలన్నారు. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా క్లస్టర్ కాంప్లెక్స్ సమావేశాలను విజయవంతంగా నిర్వహించడంపై మంత్రి లోకేష్ ఉపాధ్యాయులు, అధికారులను అభినందించారు. ఎఐ సమర్థ్ ఇనిషియేటివ్ ద్వారా ఉపాధ్యాయులకు ఎఐ టూల్స్ లో ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ విద్యా సంవత్సరంలో పదోతరగతి విద్యార్థులకు నిర్వహించే మిషన్ మార్చి -2026పై సమీక్షించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇన్ సర్వీసు ఉపాధ్యాయులకు తప్పనిసరిగా నిర్వహించాల్సిన స్పెషల్ టెట్ నిర్వహణపై చర్చించారు.

ఈనెల 5వతేదీన ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విజయవాడలో 192మంది ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించేందుకు ఏర్పాట్లు చేసినట్లు పాఠశాల విద్య డైరక్టర్ చెప్పారు. మధ్యాహ్న భోజన పథకం నాణ్యత విషయంలో రాజీ పడబోమని, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు లీప్ యాప్ ద్వారా ఫీడ్ బ్యాక్ అందజేయాలని మంత్రి కోరారు. విద్యార్థుల్లో మనోవికాసానికి, వత్తిడిలేని అభ్యసన పద్ధతులపై ఉపాధ్యాయులు దృష్టి సారించాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా 125 కేంద్రాల్లో ఆటిజం సెంటర్ల ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Exit mobile version