తిరుపతి : జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కావాలని కేంద్ర సర్కార్ నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నం చేస్తోందని సంచలన ఆరోపణలు చేశారు మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్. తిరుపతిలో ఆదివారం మీడియాతో మాట్లాడారు. తమ ప్రభుత్వ హయాంలో పేదల వ్యక్తిత్వాన్ని పెంచేందుకు, భూస్వాముల చేతుల్లో అణిగిపోకుండా ఉండేందుకు ఉపాధి హామీ చట్టం తీసుకు రావడం జరిగిందన్నారు. కామ్రేడ్ హరికిషన్ సింగ్ సూర్జిత్ ఇచ్చిన స్ఫూర్తితో, సోనియాగాంధీ , యూపీఏ ప్రభుత్వం అమలు చేసిందన్నారు. అంటరానితనాన్ని తీసివేసి ఆలయ ప్రవేశం కల్పించిన ఘనత మహాత్మా గాంధీదేనని స్పష్టం చేశారు చింతా మోహన్. పేదవాళ్లు వ్యక్తిత్వాన్ని పెంచేందుకు, భూస్వాముల చేతుల్లో అణిగి పోకుండా, స్వతంత్ర భారతదేశంలో స్వతంత్రంగా జీవించడానికి ఉపాధి హామీ చట్టాన్ని యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిందని చెప్పారు. ఉపాధి హామీ చట్టంలో మహాత్మా గాంధీ పేరును తీసివేయడాన్ని నిరసిస్తూ, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు తిరుపతిలో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఉపాధి హామీ చట్టం రాజశేఖర్ రెడ్డి తెచ్చిన పథకం కాదన్నారు. జలంధర్ లో పుట్టిన, ఒక గొప్ప మహానుభావుడు కామ్రేడ్ హరికిషన్ సింగ్ సూర్జిత్ అని కొనియాడారు. 18 సంవత్సరాల వయసులో, పెళ్లి పీటల మీద కూర్చుని ఉన్న హరికిషన్ సింగ్ సూర్జిత్ ని బ్రిటిష్ ప్రభుత్వం అరెస్టు చేసి, లాహోర్ జైల్లో, ఆరు నెలలు సూర్యుడు కనపడకుండా, అండర్ గ్రౌండ్ జైల్లో పెట్టారన్నారు. బ్రిటిష్ డౌన్ డౌన్ అన్నందుకు ఆయన అరెస్టు చేసినట్లు తెలిపారు . బిజెపి, కూటమి ప్రభుత్వం పేదల జీవితాలను నాశనం చేస్తోందని విమర్శించారు. ఎస్సీలు, ఓబీసీలు నాశనం కావాలని, భూస్వాముల చేతుల్లో నలిగి పోవాలన్న దురుద్దేశంతో ఉపాధి హామీ చట్టంలో మార్పులు చేశారన్నారు.
