ఓర్వకల్లులో వేగంగా పారిశ్రామిక అభివృద్ధి

కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన ఏపీ కూట‌మి స‌ర్కార్

hellotelugu-orvakallu

అమ‌రావ‌తి : ఓర్వకల్లులో పారిశ్రామిక అభివృద్ధి వేగంగా సాగుతోందని, ఇప్పటికే వేల కోట్ల రూపాయల పెట్టుబడులు సమకూరాయని, రిలయన్స్ సంస్థకు చెందిన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కూడా త్వరలో పూర్తి కానుందని పేర్కొన్నారు మంత్రి బీసీ జ‌నార్ద‌న్ రెడ్డి. 2014–19 మధ్య అనంతపురానికి కియా మోటార్స్ పరిశ్రమను తీసుకు రావడం వల్ల సుమారు 13 వేల మందికి ఉద్యోగాలు లభించాయని, ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతోందని పేర్కొన్నారు. పరిశ్రమల రాకతో స్థానిక భూముల విలువలు గణనీయంగా పెరిగాయని చెప్పారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో గత వైసీపీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించిందని ఆరోపించారు. 2014–19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులపై రూ.12,441 కోట్లు ఖర్చు చేయగా, 2019–24 మధ్య వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రూ.2 వేల కోట్లు కూడా పూర్తిస్థాయిలో ఖర్చు చేయలేదని విమర్శించారు.

అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం రెండేళ్లలోనే రూ. రూ.12,484 కోట్లకు పైగా వ్యయం చేసి హంద్రీ–నీవా సహా పలు ప్రాజెక్టుల పనులను వేగవంతం చేసిందని తెలిపారు. రాయలసీమను లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులతో దేశంలోనే అతిపెద్ద ఉద్యానవన కేంద్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు. డ్రిప్ ఇరిగేషన్‌కు మళ్లీ ప్రాధాన్యం కల్పించామని, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, చిన్న, సన్నకారు రైతులకు సబ్సిడీతో పరికరాలు అందించే చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఐదేళ్లపాటు ఈ పథకాన్ని నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. వ్యవసాయం, ఉద్యానవన రంగాల్లో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అనంతపురం, చిత్తూరు, కర్నూలు జిల్లాలు రాష్ట్రంలో అత్యధిక ఆదాయం సాధించాయని పేర్కొంటూ, రాయలసీమ అభివృద్ధిని అడ్డుకుంది వైసీపీ ప్రభుత్వమేనని విమర్శించారు.

Exit mobile version