న్యూఢిల్లీ : ఏఐసీసీ అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ మల్లికార్జున్ ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రశ్నా పత్రాల లీకేజీ నిరోధక బిల్లు అసంపూర్ణమని, అప్రజాస్వామికమని పేర్కొన్నారు. విద్యార్థులపై దాడులకు పాల్పడడానికి బాధ్యత వహిస్తూ కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సవరించిన చట్టం లీకేజీలకు గల మూల కారణాలను పరిష్కరించడంలో విఫలమైందని ఆరోపించారు. విద్యార్థుల నిరసనల ఒత్తిడితోనే ప్రభుత్వం ఇలా వ్యవహరించిందని కాంగ్రెస్ అధినేత ఆరోపించారు. నిరసన తెలుపుతున్న విద్యార్థులను శాంతింప జేయడానికే ఈ సవరణ చట్టాన్ని హడావిడిగా తెచ్చారని పేర్కొన్నారు. విద్యార్థులపై అణచివేత చర్యలకు బాధ్యత వహిస్తూ అమిత్ షా తప్పు కోవాలన్నారు ఖర్గే. పరీక్షల నిర్వహణ విధానంలో వ్యవస్థాగత సంస్కరణలు చేపట్టాలని కోరారు. సమస్యను పరిష్కరించడానికి కాకుండా, కేవలం ఆందోళన చేస్తున్న యువతను శాంతింప జేయడానికే ప్రభుత్వం ఈ సవరణను తెచ్చిందని రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే గురువారం విమర్శించారు.
పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (అక్రమ పద్ధతుల నివారణ) సవరణ బిల్లు-2026పై మాట్లాడారు. ప్రశ్నపత్రాల లీకేజీని నివారించేలా పరీక్షలను ఎలా నిర్వహిస్తారో ప్రభుత్వం వివరించలేదని ఖర్గే పేర్కొన్నారు. భారీ జరిమానాలు, కఠిన శిక్షలు , వేగవంతమైన విచారణ కోసం ప్రత్యేక కోర్టుల ఏర్పాటు వంటి నిబంధనల వల్ల లీకేజీల విషయంలో పెద్దగా మార్పు ఉండదని ఆయన అన్నారు. ప్రభుత్వం పరీక్షలను నిర్వహించే విధానమే అసలైన మార్పును తీసుకు వస్తుందని ఆయన వాదించారు. విద్యా సంస్థలు, పరీక్షల వ్యవస్థలో సంస్కరణలు చేపట్టి, బాధ్యతను నిర్ధారించక పోతే లీకేజీలు జరుగుతూనే ఉంటాయని ఎద్దేవా చేశారు మల్లికార్జున్ ఖర్గే. ప్రశ్నపత్రాల లీకేజీలు అమాయక విద్యార్థులను , వారి తల్లిదండ్రులను తీవ్రంగా బాధిస్తాయని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ తన ‘భారత్ జోడో యాత్ర’లో ఈ సమస్యను లేవనెత్తారని, 2024లో ఈ బిల్లును మొదట ఆమోదించినప్పుడే ప్రతిపక్షం కఠినమైన చట్టం కావాలని డిమాండ్ చేసిందని ఆయన గుర్తుచేశారు.
