హైదరాబాద్ : రాష్ట్ర మంత్రివర్గంలోని ఒక మంత్రిపై వచ్చిన కథనానికి సంబంధించి సీనియర్ జర్నలిస్టులు దొంతు రమేష్, పరిపూర్ణ చారి, సుధీర్‌లను అరెస్టు చేయడాన్ని తెలంగాణ జర్నలిస్టుల ఫోరం తీవ్రంగా ఖండించింది. స్థానిక జర్నలిస్టులకు కనీసం ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ‘సిట్’ అరెస్టులు చేయించిన రాష్ట్ర ప్రభుత్వం తీరు అత్యంత దారుణం అని అన్నారు తెలంగాణ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు పల్లె రవికుమార్ గౌడ్. ఒక మీడియా సంస్థలో ప్రచురితమైన కథనాలకు ఆ సంస్థ సంపాదకుడు, ఆ సంస్థ చైర్మన్ పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. కానీ ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగులను అరెస్టు చేయడం ఏమిటి అని ప్రశ్నించారు.
గురువారం టీజీఎఫ్ ఆధ్వర్యంలో మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజల పాలన అని చెబుతోందని, కానీ అందుకు విరుద్దంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఈ విషయంపై నిష్పక్షపాత విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. గత 3 దశాబ్దాలుగా జర్నలిజంలో పనిచేస్తున్న ఈ ముగ్గురు జర్నలిస్టులపై కేసులు పెట్టడం వెనుక కుట్ర ఉన్నట్లు కనిపిస్తోందని చెప్పారు. సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం పాటుపడే సదరు జర్నలిస్టులు , తెలంగాణ ఉద్యమంలో కూడా ముందుండి పోరాడారని గుర్తు చేశారు. బహుజన వర్గాలకు చెందిన జర్నలిస్టులను సిట్ అరెస్టు చేయడాన్ని తెలంగాణ జర్నలిస్టుల ఫోరం తీవ్రంగా ఖండిస్తోందని చెప్పారు.















