చెరకు సాగు విస్తీర్ణాన్ని గణనీయంగా పెంచాలి

చ‌క్కెర ప‌రిశ్ర‌మ‌లను పున‌రుద్ద‌రించాలి

hellotelugu-TelanganaCS

హైద‌రాబాద్ : రాష్ట్రంలో చెరకు సాగు విస్తీర్ణాన్ని గణనీయంగా పెంచడంతో పాటు, చక్కెర పరిశ్రమల పునరుద్ధరణ, వాటి ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింత మెరుగు పరిచేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సంబంధిత అధికారులను ఆదేశించారు. చక్కెర పరిశ్రమల పునరుద్ధరణ , చెరకు సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు ప్రభుత్వం జారీ చేసిన G.O. నం. 86 ప్రకారం ఏర్పాటు చేసిన కమిటీ సమావేశం బుధ‌వారం సచివాలయంలో ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణ ఆదిత్య, చెరకు రైతు ప్రతినిధులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ రాష్ట్రంలో మొత్తం 12 చక్కెర కర్మాగారాలు ఉన్నప్పటికీ, ప్రస్తుతం కేవలం 7 మాత్రమే పని చేస్తున్నాయని తెలిపారు. ఈ పరిశ్రమలు పూర్తి సామర్థ్యంతో పని చేయడానికి ఏటా సుమారు 50 లక్షల మెట్రిక్ టన్నుల చెరకు అవసరమని, కానీ ప్రస్తుతం రాష్ట్రంలో కేవలం 20 లక్షల మెట్రిక్ టన్నుల చెరకు మాత్రమే ఉత్పత్తి అవుతోందని ఆయన వివరించారు. వరి సాగుతో పోలిస్తే చెరకు సాగుకు తక్కువ నీరు అవసరమని, డ్రిప్ ఇరిగేషన్ (బిందు సేద్యం) వంటి ఆధునిక సాగు పద్ధతులను అవలంబించడం వల్ల దిగుబడి పెరగడమే కాకుండా సాగు ఖర్చులు కూడా తగ్గుతాయని ఆయన పేర్కొన్నారు. 2026–27 వ్యవసాయ సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా 19,000 మంది రైతులు 26,000 హెక్టార్లలో చెరకు సాగు చేస్తున్నారని ఆయన తెలిపారు.

చెరకు సాగు విస్తీర్ణాన్ని పెంచడానికి, చక్కెర పరిశ్రమలకు ముడి చెరకు లభ్యతను మెరుగు పరచడానికి ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న ప్రోత్సాహకాలు, విధానాలపై సమగ్రంగా అధ్యయనం చేసి, వెంటనే నివేదిక సమర్పించాలని ప్రధాన కార్యదర్శి అధికారులను ఆదేశించారు.సమావేశంలో రైతు ప్రతినిధులు మాట్లాడుతూ, వరి రైతులకు ఇస్తున్నట్లుగానే చెరకు రైతులకు కూడా టన్నుకు రూ. 500 ప్రోత్సాహకం కల్పించాలని కోరారు. చెరకు సాగుకు అధిక పెట్టుబడి అవసరం కావడం , వ్యవసాయ కూలీల కొరత రైతులకు ప్రధాన సవాళ్లుగా మారాయని వారు వివరించారు. చక్కెరతో పాటు ఇథనాల్ , విద్యుత్ ఉత్పత్తికి కూడా చెరకు దోహదపడుతుందని పేర్కొంటూ, ఈ రంగానికి మరింత ప్రోత్సాహం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

Exit mobile version