అమరావతి : ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ కీలక ప్రకటన చేశారు. ఫిబ్రవరి 11వ తేదీ నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన షభ 2026 బడ్జెట్ సమావేశాలు జరుగుతాయని తెలిపారు. శనివారం ఆయన కీలక ప్రకటన చేశారు. బడ్జెట్ సమావేశాలలో భాగంగా ఫిబ్రవరి 14న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ 2026-2027 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ను ప్రవేశ పెడతారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ హాజరవుతారని పేర్కొన్నారు. గుంటూరు జిల్లా అమరావతిలోని వెలగపూడిలో ఉన్న అసెంబ్లీ హాలులో ఫిబ్రవరి 11న ఉదయం 10 గంటలకు సమావేశం జరుగుతుందని పేర్కొన్నారు. బడ్జెట్ సమావేశాలు మార్చి 12 వరకు నాలుగు వారాల పాటు జరుగుతాయని వెల్లడించారు సీఎస్ విజయానంద్.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 174లోని క్లాజ్ (1) ద్వారా సంక్రమించిన అధికారాలను ఉపయోగించి తాను పదహారవ ఆంధ్రప్రదేశ్ శాసనసభను దాని ఐదవ సమావేశం కోసం సమావేశ పరుస్తున్నానని రాష్ట్ర భవన్ పేర్కొంది. ఫిబ్రవరి 11న ఉదయం 10 గంటలకు శాసనసభ , శాసన మండలి ఉభయ సభల సంయుక్త సమావేశంలో గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 12న, సభ్యులు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశ పెడతారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫిబ్రవరి 13న ఈ తీర్మానంపై సమాధానం ఇస్తూ, ప్రభుత్వ ప్రాధాన్యతలు , కార్యాచరణ ప్రణాళికను వివరిస్తారు. 14వ తేదీన, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. అదే రోజు, వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు సభలో వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశ పెడతారు.

















