చెన్నై : తమిళనాడులో త్వరలో జరగబోయే శాసన సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కూటమి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నితిన్ నబిన్. చెన్నై లోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో తన అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ బలోపేతం కోసం ప్రయత్నం చేయాలని స్పష్టం చేశారు. పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టాలని అన్నారు నితిన్ నబిన్. ప్రతి రోజూ మనకు అత్యంత ముఖ్యమని అన్నారు. తమిళనాడు రాష్ట్రంలో రోజు రోజుకు పరిస్థితులు అంత ఆశాజనకంగా లేవన్నారు. ప్రజలు డీఎంకే నేతృత్వంలోని సర్కార్ పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు.
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కమలం శ్రేణులు కృషి చేయాలని దిశా నిర్దేశం చేశారు నితిన్ నిబిన్. అంతే కాకుండా తమిళనాడు వ్యాప్తంగా ప్రజలు డీఎంకే ప్రభుత్వ భారీ అవినీతితో పాటుపేలవమైన పాలనతో విసిగి పోయారని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమర్థవంతమైన నాయకత్వంలోని ఎన్డీఏ సంపన్న, అవినీతి రహిత తమిళనాడు కలను ప్రతి ఇంటికి, ప్రతి బూత్‌కు చేరవేయడానికి అంకిత భావంతో పని చేయాలని పిలుపునిచ్చారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్. కూటమి భాగస్వామ్య పక్షాలతో కలిసికట్టుగా ముందుకు వెళ్లాలని స్పష్టం చేశారు. ఈసారి ఎన్నికల్లో సత్తా చాటాలని అన్నారు.















