హైదరాబాద్ : తెలంగాణలో మంత్రులకు మహిళా ఐఏఎస్ అధికారులకు మధ్య ప్రేమాయణం నడుపుతున్నారంటూ నరేంద్ర చౌదరి చైర్మన్ గా ఉన్న ఎన్టీవీ తెలుగు ఛానల్ అత్యంత జుగుస్సాకరంగా, సిగ్గు పడేలా, పాత్రికేయ విలువలకు తిలోదకాలు ఇస్తూ ప్రసారం చేయడం కలకలం రేపింది. ఈ సందర్భంగా శనివారం తెలంగాణ ఐపీఎస్, ఐఏఎస్ అధికారుల సంఘం. వెంటనే ఇలాంటి వార్తలను నిలిపి వేయాలని, బేషరతుగా బేస్ లెస్ వార్తలను ప్రసారం చేసినందుకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. చట్ట పాలనను కాపాడటం, ప్రభుత్వ సంస్థల సమగ్రతను పరిరక్షించడం, మహిళా అధికారులు భయం, పక్షపాతం లేదా వేధింపులు లేకుండా సేవలందించాలని అసోసియేషన్ తన నిబద్ధతను పునరుద్ఘాటించింది .
తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘం ఐఏఎస్ అధికారుల సంఘంతో తన స్పష్టమైన సంఘీభావాన్ని నమోదు చేసింది . కొన్ని మీడియా వేదికలు ప్రసారం చేసిన బాధ్యతారహితమైన, దురుద్దేశ పూరితమైన , పరువు నష్టం కలిగించే ప్రసారాన్ని తీవ్రంగా ఖండిస్తోందని తెలిపింది., ఇందులో పనిచేస్తున్న మహిళా ఐఏఎస్ అధికారులపై నిరాధారమైన ఆరోపణలు చేయడం, నిందలు వేయడం సరికాదంటూ పేర్కొంది. ఈ సంఘటనను జర్నలిజం ముసుగులో ఉద్దేశ పూర్వకంగా వ్యక్తిత్వ హత్యకు చేసిన ప్రయత్నంగా అసోసియేషన్ భావిస్తోంది. స్త్రీ ద్వేషపూరిత మనస్తత్వాన్ని కూడా ప్రతిబింబిస్తుందని తెలిపింది. ఈ చర్యలు సంస్థాగత నైతికతను దెబ్బ తీస్తాయని, పాలనపై ప్రజల విశ్వాసాన్ని కోల్పోయేలా చేస్తాయని పేర్కొంది సంఘం.
