తిరుపతి : తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ( టీటీడీ ) కీలక ప్రకటన చేసింది. కడప జిల్లా దేవుని కడపలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఏప్రిల్ 29 నుండి మే 1వ తేదీ వరకు తెప్పోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా స్వామివారు, అమ్మవారు ఆలయ పుష్కరిణిలో ప్రతి రోజు సాయంత్రం 6 గంటలకు తెప్పపై విహరించి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
ఉత్సవాల సందర్బంగా వివరాలు ఇలా ఉన్నాయి. ఏప్రిల్ 29వ తేదీన శ్రీ కృష్ణ సమేత గోదాదేవి 3 చుట్లు తిరుగుతారని పేర్కొంది టీటీడీ. 30న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామివారు 5 చుట్లు విహరిస్తారని వెల్లడించింది. అంతే కాకుండా మే1వ తేదీన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామివారు 7 చుట్లు తిరుగుతారని పేర్కొంది. ఈ మూడు రోజుల పాటు ప్రతిరోజు ఉదయం 10 నుండి 11 గంటల వరకు స్నపన తిరుమంజనం, సాయంత్రం 5.30 నుండి 6 గంటల వరకు తిరువీధి ఉత్సవం నిర్వహించనున్నట్లు తెలిపింది.
అదేవిధంగా టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్, దాస సాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా తెప్పోత్సవాలను పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్తానం పాలక మండలి ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. మరో వైపు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టీటీడీ ఆధ్వర్యంలోని అన్ని దేవాలయాలను మరింత సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. ఇదే సమయంలో దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్నదానం చేపట్టాలని ఆదేశించారు.



















