హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం దీక్షా దివస్ ను నిర్వహంచారు అంగరంగ వైభవోపేతంగా. ఈ సందర్బంగా తెలంగాణ భవన్‌లో నిర్వహించిన దీక్షా విజయ్ దివస్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు. తెలంగాణ తల్లి విగ్రహానికి, అంబేద్కర్ చిత్రపటానికి, ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నవంబర్ 29 కేసీఆర్ దీక్షా దివస్ లేకపోతే డిసెంబర్ 9 లేదు, డిసెంబర్ 9 లేకపోతే జూన్ 2 లేదన్నారు.. తెలంగాణ ఉద్యమం అంటేనే కేసీఆర్ త్యాగం తప్ప మరోటి గుర్తుకు రాదన్నారు హరీశ్ రావు. ఆయన చేసిన పోరాట ఫలితమే నేటి తెలంగాణ రాష్ట్రమని స్పష్టం చేశారు. కొందరు కావాలని బద్నాం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
నా శవం మీద తెలంగాణ జెండా కప్పండని ప్రాణ త్యాగానికి తెగించి పోరాడిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని ప్రశంసించారు. కేసీఆర్ అంటే పోరాటం, కేసీఆర్ అంటే త్యాగం. రేవంత్ రెడ్డి అంటే వెన్నుపోటు, రేవంత్ అంటే ద్రోహం అని సంచలన ఆరోపణలు చేశారు. సమైక్యవాదుల బాటలో నడుస్తూ రేవంత్ రెడ్డి తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బ తీస్తున్నారంటూ వాపోయారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చే హక్కు రేవంత్ రెడ్డికి లేదు.. అది పోరాటంలో పుట్టిన భావోద్వేగం అని అన్నారు తన్నీరు హరీశ్ రావు. నాడు ఉద్యమకారులపై తుపాకీ పట్టుకున్న చరిత్ర హీనుడు రేవంత్ రెడ్డి అని, నేడు తల్లి విగ్రహాన్ని మారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికాలో మన బిడ్డలను జైల్లో వేసిన ట్రంప్ పేరును హైదరాబాద్ రోడ్డుకు పెడతావా? ఇది భారతీయులను అవమానించడం తప్పా మరోటి కాదన్నారు.

















