అనంతపురం జిల్లా : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టి గల నాయకత్వంలో భారతదేశ జాతీయ విద్యా విధానం (NEP), డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా, వికసిత్ భారత్ 2047 దార్శనికత ద్వారా విజ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థను నిర్మిస్తున్నారని అన్నారు మంత్రి నారా లోకేష్. ఈ స్ఫూర్తితో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ‘స్వర్ణాంధ్ర – 2047’ దిశగా అడుగులు వేస్తున్నారని చెప్పారు. తద్వారా విద్య, ఆవిష్కరణలు, ఉపాధి అవకాశాలను సృష్టించగల, భవిష్యత్తుకు సంసిద్ధమైన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దుతున్నారని పేర్కొన్నారు. అనంతపురంలోని బుధవారం ఏపీ సెంట్రల్ యూనివర్సిటీ తొలి స్నాతకోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము, గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ఈరోజు యువ పట్టభద్రులతో నిండిన ఈ సభను చూస్తున్నప్పుడు… నాకు కేవలం పట్టాలు స్వీకరిస్తున్న విద్యార్థులు మాత్రమే కనిపించడం లేదని అన్నారు.
భవిష్యత్తును తీర్చిదిద్దడానికి సిద్ధంగా ఉన్న ఒక తరం కనిపిస్తోందని అన్నారు. ప్రతి తరానికీ ఒక ప్రత్యేక గుర్తింపు ఉంటుందన్నారు లోకేష్. భవిష్యత్తును నిర్మించే అవకాశం ఈ తరానికి లభించిందని చెప్పారు. ఇది మీ సమయం, ఇది మీకు లభించిన గొప్ప అవకాశం అని అన్నారు. మీ నేపథ్యం మీ భవిష్యత్తును నిర్ణయించేలా ఎప్పుడూ అనుమతించకండి. మీ కలలు, మీ కఠోర శ్రమ, మీ వ్యక్తిత్వం ఇవే ముఖ్యమన్నారు. ఈరోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తో కలిసి ఇక్కడ కూర్చునే భాగ్యం మనకు దక్కిందన్నారు. ఆమె జీవితం కేవలం తరగతి గదిలో నేర్వలేని ఒక పాఠం అని పేర్కొన్నారు. ఆమె ఒక చిన్న గిరిజన గ్రామంలో జన్మించారు. చాలా మందిలాగే కుంగదీసే వ్యక్తిగత విషాదాలను ఆమె ఎదుర్కొన్నారు. అయినా ఆమె ఎన్నడూ విశ్వాసం కోల్పోలేదు… సేవ చేయడం ఆపలేదు… ముందుకు సాగడం ఆపలేదు. ఒక ఉపాధ్యాయురాలిగా… ఒక శాసనసభ్యురాలిగా… ఒక గవర్నర్‌గా… ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి రాష్ట్రపతిగా మన ముందున్నారని ప్రశంసలు కురిపించారు.


















