తెలంగాణ విజన్ 2047ను అమలు చేయాలి

స్ప‌ష్టం చేసిన సీఎం అనుముల రేవంత్ రెడ్డి

hellotelugu-RevanthReddy

హైద‌రాబాద్ : తెలంగాణ ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. గురువారం ఉన్న‌తాధికారుల‌తో స‌మీక్ష చేప‌ట్టారు. తెలంగాణ విజ‌న్ 2047ను అమలు చేయాల‌ని ఆదేశించారు. విజన్‌లోని ప్రతి అంశాన్ని అమలు చేయడం ప్రారంభించాలని సూచించారు. అంతర్-విభాగ సమన్వయం, సామర్థ్యం ద్వారా మాత్రమే తెలంగాణ రైజింగ్ విజన్ లక్ష్యాలను సాధించగలమని స్ప‌ష్టం చేశారు. ఇటీవల ఫ్యూచ‌ర్ సిటీ వేదిక‌గా జరిగిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో విడుదల చేసిన విజన్ డాక్యుమెంట్ అభివృద్ధికి ఒక రోడ్‌మ్యాప్ అని అన్నారు. ఇది కేవలం ప్రచార కార్యక్రమం కాదని ఆయన అన్నారు. 2047 నాటికి రాష్ట్రాన్ని మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నామ‌ని, దానిని సాధించేందుకు ప్ర‌య‌త్నం చేయాల‌న్నారు.

అంతే కాకుండా అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడానికి కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని అన్ని విభాగాల అధికారులను ఆదేశించారు. పనితీరు సరిగా లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వం అందరు కార్యదర్శుల పనితీరును సమీక్షిస్తుందని పేర్కొన్నారు. ప్రతి నెలా తమ పనితీరుపై ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావుకు నెలవారీ నివేదికను సమర్పించాలని పేర్కొన్నారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. అంతే కాకుండా క్షేత్ర స్థాయిలో పనుల పురోగతిని తనిఖీ చేయడానికి ఐఏఎస్ అధికారులు ప్రతి 10 రోజులకు ఒకసారి క్షేత్ర పర్యటనలు చేయాలని ఆదేశించారు. అన్ని విభాగాల సీనియర్ అధికారులు జవాబుదారీతనంతో పని చేయాలని ఆయన నొక్కి చెప్పారు.

Exit mobile version